పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం ప్రధానాంశాలివే..
పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 6:28 AM GMTపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం ప్రధానాంశాలివే..
పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్ భవనంలో ఇదే తన తొలి ప్రసంగమని చెప్పారు. భారత సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లోనూ అర్థవంతమైన చర్చ జరగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గత ఏడాది మన దేశం ఎన్నో ఘనతలను సాధించిందని చెప్పారు. చంద్రుడి దక్షిణ దృవంపై అడుగుపెట్టిన తొలి దేశం మన భారతే అని ఎప్పారు చెప్పారు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించిందని అన్నారు. ఇక శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందని అన్నారు. భగవాన్ బిర్సా ముండా జనమదినాన్ని జన్ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నామనీ.. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటు కానుందని చెప్పారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గవ్వకారణమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
మరోవైపు మన దేశంలో జరిగిన జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని రాష్ట్రపతి అన్నారు. ఆసియా క్రీడల్లో తొలిసారి భారత్ 107, పారా క్రీడల్లో 111 పతకాలను సాధించిందని గుర్తు చేశారు. తొలిసారిగా నమో భారత్ రైలును కూడా ఆవిష్కరించుకున్నట్లు రాష్ట్రపతి చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా నారీశక్తి వందన్ అధినియమ్ బిల్లును కూడా ఆమోదించుకున్నామని రాష్ట్రపతి అన్నారు. రీఫార్మ్, పర్‌ఫ్రార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న రాష్ట్రపతి.. ప్రపంచంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో చరిత్రను తిరగరాశామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఇక మన చిన్నతనం నుంచి 'గరీబీ హఠావో' నినాదం ఉందనీ.. కానీ జీవితంలో తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ హయాంలోనే పారదోలడం చూస్తున్నామని రాష్ట్రపతి అన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా భారత సర్కార్ ముందుకెళ్తోందని చెప్పారు. 500 ఏళ్లకు పైగా ఉన్న కల కూడా నెరవేరిందని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఎన్నో ఆటంకాలను అధిగించుకుని నిర్మించుకున్నామనీ.. ఇటీవలే ఆలయ ప్రారంభోత్సవం జరిగిందని చెప్పారు. మరోవైపు దేశంలో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోందని రాష్ట్రపతి అన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలను తెచ్చామన్నారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయనీ.. ఐటీ రిటర్న్ ఫైల్ చేసే వారి సంఖ్య కూడా పెరిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.