రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. నూతన ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి
Parliament Budget Sessions on january 29. ఈనెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
By Medi Samrat Published on 28 Jan 2021 3:49 PM ISTఈనెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు కొనసాగనుండగా, తొలి దశలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు, రెండో దశ మార్చి 8 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే గతంలో జరిగిన వర్షాకాల సమావేశాలు మాదిరిగానే కరోనా నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న తర్వాత దేశం తిరిగి వృద్ధి పథంలోకి రావాలని చూస్తున్న తరుణంలో 2021-22 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌పైనే అందరి దృష్టి ఉంది.
కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వంపైన వ్యయం ఎక్కువగా పడింది. పైగా ఇప్పుడున్న వ్యాక్సిన్ తయారీకి భారీగా ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా వైరస్ సెస్ లేదా సర్‌చార్జీని ప్రవేశపెట్టే ప్రణాళికపై కేంద్రం చర్చలు జరిపింది. గత ఏడాది జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. దాంతో ఇప్పుడు ప్రభుత్వం రాబడులు పెంచుకునేందుకు మార్గాలు వెతుకుతోంది. ఈ క్రమంలోనే సంపన్నులపై అదనంగా కోవిడ్ సెస్ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పెట్రోలియం, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టాలని కూడా కేంద్ర సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఫిబ్రవరి 1న బడ్జెట్‌పై ఉన్న అపోహాలు తొలగిపోనున్నాయి.
నూతన ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టనున్న ప్రభుత్వం..
కాగా, కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈసారి స్పెక్టం వేలంపై వేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం గత నెలలో ఆమోదం తెలిపింది. టెలికాం కంపెనీలు ఈ వేలంలో పాల్గొనడానికి ఫిబ్రవరి 5లోగా తమ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా పీఎస్‌యూ, నాన్ కోర్ ఆస్తులను కూడా విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ కూడా ప్రారంభించనుంది. ఇక వీటి ద్వారా ప్రభుత్వం కనీసం 10 వేల కోట్ల వరకు నిధులను సేకరించనుంది.