పాన్ తో ఆధార్ లింక్.. మరోసారి పొడిగించారు

Pan Aadhaar link extended.తాజాగా పాన్‌కార్డుతో ఆధార్‌ను అనుసంధానించే గడువును కేంద్రం మరోమారు పొడిగించింది జూన్ 30 వరకు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2021 6:39 AM GMT
Pan Aadhaar link extended

పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయ‌డానికి మార్చి 31 ఆఖ‌రి రోజు అని కేంద్రం ఇంతకు ముందు తెలిపింది. ఒక‌వేళ మీరు గ‌డువు ముగిసిన త‌రువాత పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేసిన‌ట్లైతే రూ.1000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం.

తాజాగా పాన్‌కార్డుతో ఆధార్‌ను అనుసంధానించే గడువును కేంద్రం మరోమారు పొడిగించింది. ఈ గడువు మార్చి 31తో ముగియనుండగా జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో సాంకేతికపరమైన ఇబ్బందుల కారణంగా పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించుకోలేకపోతున్నట్టు ఫిర్యాదులు రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పొడిగించిన గడువులోపు పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని కోరింది.

పాన్, ఆధార్ అనుసంధానం గడువును ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో గతేడాది జులై 31 నుంచి 31 మార్చి 2021 వరకు పొడిగించింది. తాజాగా మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పాన్‌‌కార్డు, ఆధార్ కార్డులను లింక్ చేయకపోతే లేట్ ఫీజుకు కింద రూ. 1,000 వరకు కట్టాల్సి ఉంటుంది. పాన్‌ కార్డును ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేయడం చాలా సులభం. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా సులువుగా లింక్ చేసుకోవచ్చు. ఇంతకు ముందే రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఇన్‌కం టాక్స్ ఇండియా ఇ ఫైలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. యూజర్ ఐడీ, పాస్‌వర్డుతో లాగిన్ కావాలి. ప్రొఫైల్ సెట్టింగ్‌లోకి వెళ్తే 'లింక్‌ ఆధార్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అడిగిన వివరాలు ఇచ్చి పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు.


Next Story