నర్మదా లోయలో.. అరుదైన డైనోసార్ గుడ్లు, గూళ్లు గుర్తింపు

Paleontologists Find Rare Dinosaur Nests In Narmada Valley. మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది లోయలో అరుదైన డైనోసార్‌ గుడ్లు, గూళ్లు బయటపడ్డాయి.

By అంజి  Published on  22 Jan 2023 7:33 AM GMT
నర్మదా లోయలో.. అరుదైన డైనోసార్ గుడ్లు, గూళ్లు గుర్తింపు

మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది లోయలో అరుదైన డైనోసార్‌ గుడ్లు, గూళ్లు బయటపడ్డాయి. సుమారు 6 కోట్ల సంవత్సరాల కిందట భూమిపై తిరిగిన డైనోసార్‌ గుడ్లు, గూళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. డైనోసార్ గూళ్లు, శాకాహార టైటానోసార్‌ల 256 గుడ్లను గుర్తించినట్లు పాలియోంటాలజిస్టులు తెలిపారు. ఢిల్లీ యూనివర్శిటీ, భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు.. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని బాగ్, కుక్షి ప్రాంతాలలో జరిపిన తవ్వకాల్లో వీటిని గుర్తించారు. 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో డైనోసార్లు సంచరించినట్లు గుర్తించారు.

దీనికి సంబంధించిన వివరాలను హర్ష ధీమాన్, విశాల్ వర్మ, గుంటుపల్లి ప్రసాద్ తదితరులు ఈ వారం పీఎల్‌ఓఎస్‌ వన్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించారు. పొడవాటి మెడ గల శాకాహార టైటానోసార్‌ల 256 గుడ్లు బయటపడ్డాయని తెలిపారు. సాధారణంగా, గూళ్ళు ఒకదానికొకటి కొంత దూరంలో ఉంటాయి. కానీ వీటి నివాసాలు చాలా దగ్గర దగ్గరగా అసాధారణ రీతిలో ఉన్నాయని చెప్పారు. డైనోసార్ల గుడ్లు అన్ని చాలా పెంకులతో నిర్మితమై ఉండటాన్ని వారు గమనించారు. పొదగడానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు, తల్లి తన గుడ్లను అండవాహికలోనే ఉంచుకోవడం వల్ల గుడ్లపై పెంకులు ఎక్కువగా ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు.

అయితే కొన్ని సందర్భాల్లో గుడ్లు పెట్టకముందే డైనోసార్ మరణించిన సందర్భాలు కూడా ఉండవచ్చు అని చెబుతున్నారు. 15 సెం.మీ, 17 సెం.మీ వ్యాసం కలిగిన గుడ్లు అనేక టైటానోసార్ జాతులకు చెందినవి చెబుతున్నారు. ఒక్కో గూడులోని గుడ్ల సంఖ్య ఒకటి నుండి 20 వరకు ఉంటుంది. "2017 నుంచి 2020 మధ్యకాలంలో నిర్వహించిన క్షేత్ర పరిశోధనలలో.. ధార్ జిల్లాలోని బాగ్, కుక్షి ప్రాంతాలలో ముఖ్యంగా అఖాడా, ధోలియా రాయ్‌పురియా గ్రామాల నుండి మేము విస్తృతమైన డైనోసార్ల హేచరీలను కనుగొన్నాము" అని పరిశోధకులు తెలిపారు. ఈ ప్రాంతం లోయ మధ్య భారతదేశంలోని ఎగువ నర్మదాలోని జబల్‌పూర్, పశ్చిమ మధ్య భారతదేశంలోని దిగువ నర్మదా లోయలో పశ్చిమాన బాలాసినోర్‌లో తూర్పున ఉన్న లామెటా ఎక్స్‌పోజర్‌ల మధ్య వస్తుంది.

Next Story