పేద ప్రజలకు రేషన్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా పేద ప్రజలకు జారిచేసిన రేషన్ కార్డులకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నవారు.. స్వచ్ఛందంగా రేషన్ కార్డును వదులుకోవాలని ప్రజలను కోరింది. కడు పేద ప్రజలకే రేషన్ లభించాలని.. అలాంటి వారికి లబ్ది చేకూర్చడం కోసమే ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ ఏర్పాటు చేస్తుందని కర్ణాటక ప్రభుత్వం అంటుంది. టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్న వారు కనీసం సంపాదన హెచ్చుగానే ఉంటుందని అంటుంది. ఆ వస్తువులు కలిగి ఉన్నవారు మార్చి 31 లోపు రేషన్ కార్డులను ప్రభుత్వానికి అప్పజెప్పాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి అన్నారు. లేకుంటే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ విషయాన్ని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీపీఎల్ రేషన్ కార్డు తీసుకునేవారికి ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. టీవీ, ఫ్రిజ్, బైక్ వంటి వస్తువులు ఉండకూడదు. ఏడాదికి రూ. 1.20 లక్షల కన్నా ఆదాయం కలిగి ఉన్నవారు ఈ రేషన్ కార్డులు వినియోగించకూడదు. అంతకు మించి ఆదాయం ఉన్నా.. టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నా మార్చి 31 లోపు రేషన్ కార్డులను సరెండర్ చేయాలి అని అన్నారు.
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే బెంగళూరులోని వివిధ రేషన్ షాపుల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టాయి. టివి,ఫ్రిజ్,బైక్ ఇలాంటి వస్తువులు వాయిదాల పద్దతిలో కూడా తీసుకుంటారని.. అలాంటిది అవి ఉన్నవారు ఆస్తిపరులు ఎలా అవుతారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రబుత్వం పేదల వ్యతిరేకి. ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్న రేషన్ కార్డులను తొలగించడానికి బదులుగా, వాటి లబ్దిదారుల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టాలి అని ఆయన కోరుతున్నారు.