కండోమ్స్ ఎక్కువగా వాడేది ఎవరో తెలుసా?.. మేం ముస్లింలం: ఎంపీ అసదుద్దీన్
Owaisi rejects Bhagwat's claim of 'religious imbalance', says Muslims using condoms most. భారతదేశంలో 'మత అసమతుల్యత' గురించి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన చర్చను తోసిపుచ్చిన ఏఐఎమ్‌ఐఎమ్
By అంజి Published on 9 Oct 2022 8:49 AM GMTభారతదేశంలో 'మత అసమతుల్యత' గురించి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన చర్చను తోసిపుచ్చిన ఏఐఎమ్‌ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. ముస్లింల జనాభా పెరుగుదల రేటు వాస్తవానికి క్షీణిస్తున్నదని, ముస్లింలు కండోమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. జనాభా అసమతుల్యతపై భగవత్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ వార్షిక దసరా ర్యాలీలో తన ప్రసంగంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
ముస్లింల జనాభా తగ్గుముఖం పడుతుండగా, వారి జనాభాపై భయాందోళనలు సృష్టించేందుకు మోహన్ భగవత్ ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా శనివారం అర్థరాత్రి జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. 'టెన్షన్ పడకండి.. ముస్లిం జనాభా పెరగడం లేదు.. వాస్తవానికి తగ్గుతోంది. "ఇద్దరు పిల్లల మధ్య గ్యాప్‌ని స్పేసింగ్ అంటారు. ఎవరు ఎక్కువగా కండోంలు మెయింటెయిన్ చేస్తున్నారో మీకు తెలుసా? మేము ముస్లింలు. కండోమ్‌లు ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మేము చేస్తున్నాము" అని అసదుద్దీన్ అన్నారు.
ఈ 'వాస్తవాల'పై భగవత్ మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. డేటా లేకుండా మాట్లాడినందుకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను ఒవైసీ తప్పుబట్టారు. దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) రెండు శాతానికి పడిపోయిందని ఆయన తెలిపారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 5ను గురించి చెబుతూ.. ముస్లింలలో సంతానోత్పత్తి రేటు పతనం ఎక్కువగా ఉందని అన్నారు. అలాగే హిందువులలో ఆడ భ్రూణహత్యలపై మౌనం వీడాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ని ఒవైసీ కోరారు. "ముస్లింలలో, ప్రతి 1,000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా, మన హిందూ సోదరులలో ప్రతి 1,000 మంది పురుషులకు 913 మంది మహిళలు ఉన్నారు" అని ఆయన చెప్పారు.
2020లో మోడీ ప్రభుత్వం దేశంలో కుటుంబ నియంత్రణను తప్పనిసరి చేయకూడదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిందని ఆయన ఎత్తిచూపారు. ముస్లింల పట్ల ద్వేషంతో భగవత్ ముస్లింల జనాభా పెరుగుతోందని ఆరోపిస్తూ భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంపీ అన్నారు. ముస్లింలను దేశద్రోహులు, గోవు తినేవాళ్ళు, టెర్రరిస్టులని, మదర్సాలను ఉగ్రవాద కేంద్రాలుగా చూపుతూ వారిని రాక్షసత్వానికి గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం.. తాము మైనారిటీలమని, తాను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దయతో దేశంలో జీవించడం లేదని ఆయన అన్నారు. 'హిందూ రాష్ట్రం' ఆలోచన భారత జాతీయవాదానికి విరుద్ధమని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల కలలను అది చిదిమేస్తుందని ఎంపీ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో అనేక మంది ముస్లిం నాయకులు ప్రాణాలు అర్పించినా ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొనలేదని భగవత్‌కు గుర్తు చేశారు. "మౌల్వీ అల్లావుద్దీన్‌ను కాలాపానీకి పంపారు, కాని అతను సావర్కర్ లాగా బ్రిటిష్ వారికి క్షమాపణలు రాయలేదు" అని అతను చెప్పాడు.
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మదర్సాల సర్వేపై ఆయన మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. గుజరాత్‌లో ముస్లిం యువకులపై పోలీసులు బహిరంగంగా కొరడా ఝులిపించడంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని ఎంపీ డిమాండ్ చేశారు. దీనిని చూసేందుకు గుమిగూడిన ప్రజలు నినాదాలు చేయడంతో ముస్లిం యువకులను స్తంభానికి కట్టేసి బహిరంగంగా కొట్టారని అన్నారు.