కరోనా సమయంలో భారత్ కు బాసటగా 40 దేశాలు

Over 40 countries help india.కరోనా రెండో దశపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇప్పటి వరకు 40 దేశాలు తమ సాయాన్ని ప్రకటించాయని తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 30 April 2021 8:10 AM IST

40 countries help India

కరోనా ఉద్ధృతి దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య పరికాలు, ఆక్సిజన్‌, ఔషధాలు, వ్యాక్సిన్ల కొరత ఆందోళన కలిగిస్తోంది. మన ప్రభుత్వం తనకు మాలిన ధర్మం చేయడం వల్లే మనకు గడ్డు రోజులు వచ్చాయి అని విమర్శకులు మండిపడుతుంటే. అప్పుడు సహాయం చేసాం కాబట్టే ఇప్పుడు సహాయం అందుంతోంది అంటున్నారు కొందరు. ఏది ఏమైన కానీ తగిన సదుపాయాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. దీంతో అప్రమత్తమైన కేంద్రం అన్ని దేశాల నుంచి సాయాన్ని ఆహ్వానించింది.

దేశంలో అనూహ్య పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా.. కరోనా రెండో దశపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇప్పటి వరకు 40 దేశాలు తమ సాయాన్ని ప్రకటించాయని తెలిపారు. ఆయా దేశాలు కష్ట సమయాల్లో ఉన్న తరుణంలో భారత్‌ వారిని ఆదుకుందని.. మిత్రధర్మం పాటిస్తూ ఇప్పుడు వారంతా భారత్‌కు అండగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు.

అమెరికా నుంచి ఇప్పటికే కీలక వైద్య సరఫరాలతో ప్రత్యేక విమానాలు భారత్‌కు చేరుకోగా గురువారం రాత్రి యూఏఈ నుంచి వెంటిలేటర్లు, ఫావిపిరావిర్‌ సహా మరికొన్ని వైద్య సామగ్రితో కార్గో విమానం భారత్‌కు వచ్చిందని చెప్పారు. ఇక ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌, హాంగ్కాంగ్, మారిషస్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌ నుంచి కూడా సాయం అందనుందని తెలిపారు. ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, జనరేటర్లు, క్రయోజనిక్ ట్యాంకర్లు, ప్రాణవాయువు సరఫరాకు కావాల్సిన ఇతర సామగ్రికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.రష్యాకు చెందిన రెండు సైనిక రవాణా విమానాలు భారీ సహాయక సామాగ్రితో రష్యా నుంచి భారత్‌కు బయలుదేరాయని చెప్పారు.

మొత్తంగా వివిధ దేశాల నుంచి ఇండియాకు 500కు పైగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, 4వేలకు పైగా ఆక్సిజన్ సాంద్రత పరికరాలు, పదివేల పైగా సిలిండర్లు అందుతాయని అంచనా వేశారు. గిలీడ్ సైన్సెస్ ఔషధ సంస్థ నుంచి అత్యవసరంగా 4,50,00 డోస్‌ల యాంటివైరల్ మందు రెమ్‌డెసివిర్ అందుతుంది. రష్యా, యుఎఇల నుంచి దాదాపు 300000 డోస్‌ల వరకూ ఫవిపిరవిర్ వస్తుంది, జర్మనీ , స్విట్జర్లాండ్‌ల నుంచి టోసిలిజుమాబ్ సరఫరా అవుతుందని తెలిపారు.

నిజానికి జాతీయ అవసరాలకు విదేశీ సాయాలను తీసుకోరాదని 2004లో సునామీ ఉపద్రవం నేపథ్యంలో భారతదేశం అధికారిక విధానాన్ని ఖరారు చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని పక్కకు పెట్టి సాయాన్ని తీసుకుని తీరాలని భారతదేశం సంకల్పించినట్లు విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ సాయాన్ని తాము పాలసీ పరిధిలో చూడదల్చుకోలేదన్నారు, అత్యంత క్లిష్టం, అసాధారణం అయి కూర్చున్న పరిస్థితి కోణంలో సాయాన్ని తీసుకోదల్చినట్లు వివరించారు. ఇది క్లిష్టమైన సమయం కావడంతో , ప్రజలకు అత్యవసరం అయిన వాటి కొరత లేకుండా చేసేందుకు అవసరమైన విధంగా స్పందించాల్సి ఉంటుందన్నారు.


Next Story