విదేశాల్లో రోజుకు 20 మంది భారత కార్మికులు మృతి: కేంద్రం
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన భారతీయ కార్మికుల మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 2021 నుంచి 2025 మధ్య కాలంలో మొత్తం 37,740 మంది భారతీయ కార్మికులు...
By - అంజి |
విదేశాల్లో రోజుకు 20 మంది భారత కార్మికులు మృతి: కేంద్రం
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన భారతీయ కార్మికుల మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 2021 నుంచి 2025 మధ్య కాలంలో మొత్తం 37,740 మంది భారతీయ కార్మికులు విదేశాల్లో మరణించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. అంటే సగటున రోజుకు 20 మందికి పైగా భారతీయులు విదేశీ గడ్డపై ప్రాణాలు వదులుతున్నారు. ఈ మరణాలలో అత్యధికంగా 86 శాతానికి పైగా గల్ఫ్ దేశాల్లోనే సంభవించడం గమనార్హం.
గణాంకాల ప్రకారం.. 2021లో 8,234 మరణాలు నమోదు కాగా, 2022లో ఆ సంఖ్య 6,614కు తగ్గింది. అయితే ఆ తర్వాత నుంచి మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ.. 2025 నాటికి 7,854కు చేరుకుంది. దేశాల వారీగా చూస్తే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో అత్యధికంగా 12,380 మంది, సౌదీ అరేబియాలో 11,757 మంది మరణించారు. వీరి తర్వాత కువైట్ (3,890), ఒమన్ (2,821), మలేషియా (1,915), ఖతార్ (1,760) దేశాలు ఉన్నాయి. మరణాలకు గల ఖచ్చితమైన కారణాలను ప్రభుత్వం ఈ నివేదికలో వెల్లడించలేదు.
మరోవైపు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు కార్మికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. వేధింపులు, దోపిడీ, పని ప్రదేశాల్లో సమస్యలపై గడిచిన ఐదేళ్లలో మొత్తం 80,985 ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా జీతాలు చెల్లించకపోవడం లేదా ఆలస్యం చేయడం, పాస్‌పోర్ట్‌లను యజమానులు తమ వద్దే ఉంచుకోవడం, సెలవులు నిరాకరించడం, ఓవర్ టైం లేకుండా మితిమీరిన పని గంటలు, కంపెనీల మూతతో ఉపాధి కోల్పోవడం వంటి సమస్యలను కార్మికులు ఎదుర్కొంటున్నారు. మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, వేధింపులపై ఫిర్యాదులు మాత్రం భారీగా నమోదయ్యాయి.
భారత కార్మికుల భద్రత, సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బాధితులకు రాయబార కార్యాలయాల ద్వారా న్యాయపరమైన, దౌత్యపరమైన సాయం అందిస్తున్నామని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఇప్పటికే పలు దేశాలతో కార్మిక మరియు మ్యాన్‌పవర్ సహకార ఒప్పందాలను భారత్ కుదుర్చుకుందని ఆయన వివరించారు.