వ్యాక్సినేషన్ లో భారత్ మరింత ముందుకు

Over 35 crore covid vaccine doses administered in india.కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 5:13 AM GMT
వ్యాక్సినేషన్ లో భారత్ మరింత ముందుకు

కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. సెకండ్ వేవ్ నుండి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న దేశవాసులు వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఎంతో మంచిదని తెలుసుకుని వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెల్తూ ఉన్నారు. కొద్దిరోజుల కిందట వ్యాక్సిన్ల కొరత ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ సంఖ్యను పెంచాయి. కోవాగ్జిన్, కోవిషీల్డ్, రష్యన్ కంపెనీ వ్యాక్సిన్ స్పుట్నిక్ వి ప్రస్తుతానికి అందుబాటులో వచ్చాయి. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌లో ఎక్కువ భాగం కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లదే అయినా రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. మోడెర్నా వ్యాక్సిన్, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్‌లకు భారత ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇవ్వడంతో భారత్ లో వ్యాక్సినేషన్ మరింత వేగంగా జరగనుంది.

కేంద్ర ప్రభుత్వం జూన్ 21 నుండి కొత్త వ్యాక్సినేషన్ విధానం ప్రవేశపెట్టింది. దేశంలో ప్రతిరోజూ లక్షలాది మందికి వ్యాక్సిన్ అందుతోంది. గత 12 రోజుల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6.3 కోట్లమందికి వ్యాక్సిన్ అందింది. దేశంలో ఇప్పటి వరకూ 35 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందించారు. గత 24 గంటల్లో 43 లక్షల 99 వేల 298 మందికి వ్యాక్సిన్ అందింది.ఇప్పటి వరకూ దేశంలో 18-44 సంవత్సరాల వయస్సు కేటగరీలో 9 కోట్ల 64 లక్షల 91 వేల 993మందికి మొదటి డోసు ఇవ్వగా..23 లక్షల 80 వేల 48మందికి రెండవ డోసు వ్యాక్సిన్ అందించారు. మొత్తం 35,12,21,306 వ్యాక్సిన్ డోసులు వేశారని జులై 3వ తేదీన ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సినేషన్ లో మరింత ముందుకు భారత్ వెల్తూ ఉండడం.. సింగిల్ డోస్ లు వేయించుకునే వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో కరోనా మహమ్మారిని ఎదుర్కోవచ్చు.

Next Story