కేరళలోని కాసర్‌గోడ్‌లో సోమవారం ఆలయ ఉత్సవాల సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారని, ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అంజోతంబలం వీరర్కవు ఆలయంలో వార్షిక కాళియాట్టం ఉత్సవం సందర్భంగా అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను కాసరగోడ్, కన్నూర్, మంగళూరులోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స పొందుతున్నారు.
ఆలయం సమీపంలోని బాణసంచా నిల్వ చేసే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే కలెక్టర్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సహా పలువురు జిల్లా పరిపాలన ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు.. స్థానిక సంఘాలు సహాయాన్ని అందించాయి. అగ్నిప్రమాదానికి దారితీసిన విషయాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.