పానీపూరి ఈ పేరు చెబితే చాలు చాలా మందికి నోరూరుతుంది. పానీపూరి బండి కనిపిస్తే చాలు ముందు వెనుక ఆలోచించకుండా ఎంచక్కా పానీపూరీలను లాగించేస్తుంటారు కొందరు. అయితే.. ఎక్కడపడితే అక్కడ వాటిని తినకూడదు. బండి ఎక్కడ ఉంది. వాళ్లు ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకుని తినాలి. లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోక తప్పదు. కోల్‌కతాలోని హుగ్లీ జిల్లాలో పానీ పూరీ తిన్న 100 మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు.
వివరాల్లోకి వెళితే.. హుగ్లీ జిల్లాలోని సుగంధ గ్రామ పంచాయతీ పరిధిలో డోగాచియా ప్రాంతంలోని ఓ స్ట్రీట్ స్టాల్ వద్ద బుధవారం పానీపూరీ తిన్న చాలా మంది అస్వస్థతకు గురి అయ్యారు. మూడు గ్రామాలకు చెందిన 100 మందికి పైగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్య బృందం ఘటనాస్థలానికి చేరుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు మందులు ఇచ్చారు. పలువురు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే వారిని ఆస్పత్రిలో చేరాలని సూచించారు. నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియాగా వైద్యులు అనుమానిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారంతా డోగాచియా, బహిర్ రణగాచా మరియు మకల్తలా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.