పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం ఇస్తోందన్నారు. పహల్గామ్ దాడి వెనుక టీఆర్‌ఎఫ్ ఉందని, దీనికి జైషే మహ్మద్, లష్కరే తోయిబాల మద్ధతు ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఈ దాడి చేశారని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా లక్ష్యాలను ఎంపిక చేయడం ద్వారా ఉగ్రవాద వెన్నెముకను విచ్ఛిన్నం చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఈ రోజు భారత్ బాధ్యతాయుతమైన దాడి చేసిందన్నారు. పహల్గామ్ దాడితో జమ్మూ, కశ్మీర్‌లోని శాంతి, పర్యాటకాన్ని దెబ్బతీయాలని ఉగ్రవాదులు భావించారని తెలిపారు. కానీ ప్రభుత్వం, భారత ప్రజలు సంయమనం పాటించారని విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. పాక్ భూభాగం నుంచి మున్ముందు మరిన్ని దాడులు జరుగుతాయని, వాటికి బదులు చేప్పందుకే ఆర్మీ ఆపరేషన్ చేపట్టిందన్నారు. బుధవారం ఆపరేషన్ సిందూర్ పై విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తులో పాకిస్తాన్ సంబంధం ఉందని తేలిందని అన్నారు.
పాకిస్తాన్, పీవోకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశామని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్న స్థావరాలపై అటాక్ చేశామన్నారు. ఇంటెలిజెన్స్ ఇన్‌ఫుట్స్, డ్రోన్ల ద్వారా దాడి చేశామని పేర్కొన్నారు. ఇందులో సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం కలగలేదని వివరించారు.