ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా సాగుతున్న భారీ బంగారు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఛేదించారు. 'ఆపరేషన్ ధాహబు బ్లిట్జ్' (Operation Dhahabu Blitz) పేరుతో చేపట్టిన ఈ మెరుపు దాడిలో ఏకంగా 29.37 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు రూ. 37.74 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన 24 మంది విదేశీ మహిళా క్యారియర్లను అధికారులు అరెస్ట్ చేశారు.
నైరోబి (కెన్యా) నుండి వస్తున్న మహిళా ప్రయాణికులు పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో డిఆర్ఐ ముంబై జోనల్ యూనిట్ ఈ తనిఖీలు చేపట్టింది. పట్టుబడిన మహిళల బ్యాగులు మరియు దుస్తులలో దాచిన 25.10 కిలోల బంగారు బిస్కెట్లు, 4.27 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ ముఠా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తోందని, విమానాశ్రయ భద్రతా తనిఖీలను ఎలా తప్పించుకోవాలో ఈ మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని అధికారులు గుర్తించారు.
ఈ ఆపరేషన్‌కు పెట్టిన 'ధాహబు' అనే పదానికి స్వహిలి భాషలో బంగారం అని అర్థం. ఈ ఏడాది ముంబై విమానాశ్రయంలో జరిగిన అతిపెద్ద దాడులలో ఇది ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు, ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను (Kingpins) పట్టుకునేందుకు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.