మందుబాబులకు షాక్.. ఆధార్, టీకా పత్రం ఉంటేనే మద్యం
Only vaccinated people can buy alcohol in this Tamil Nadu district.కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం అస్తవ్యస్తం
By తోట వంశీ కుమార్ Published on 3 Sept 2021 8:17 AM ISTకరోనా మహమ్మారి కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఇటీవల దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికి కూడా కొందరు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇష్టత చూపడం లేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకుంటే బంపర్ ఆఫర్లు ప్రకటించినప్పటికి టీకా వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు.
దీంతో వినూత్నంగా ఆలోచించారు ఆ జిల్లా అధికారులు. మద్యం కొనుగోలు చేయాలంటే ఇకపై ఆధార్ కార్డుతో పాటు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం చూపించాల్సిందేనని అంటున్నారు. అయితే.. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలో. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు, కరోనా టీకా పత్రం చూపాలని అధికారులు స్పష్టం చేశారు. నీలగిరి జిల్లాలో 76 మద్యం దుకాణాలు ఉండగా.. రోజుకు సుమారు రూ.కోటి విక్రయాలు జరుగుతుంటాయి. జిల్లాలో 18 ఏళ్లకు పైబడిన వారు 5.82 లక్షల మంది ఉండగా.. 70శాతం మందికి మాత్రమే టీకా వేసుకున్నారు. మిగతా వారు వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి మొగ్గుచూపేలా ప్రభుత్వ నిర్ణయం ఉందంటున్నారు కొందరు. ప్రస్తుతానికి నీలగిరి జిల్లాకే పరిమితమైన ఈ రూల్‌ను క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలో స్టాలిన్ సర్కార్ ఉందని తెలుస్తోంది.