ముంబైలో మీజిల్స్ వ్యాధి విజృంభణ.. చిన్నారి మృతి
One Year Old Dies Due To Measles In Mumbai.ముంబైలో మీజిల్స్(తట్టు) వ్యాధి రోజు రోజుకు విస్తరిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 23 Nov 2022 3:02 AM GMTముంబైలో మీజిల్స్(తట్టు) వ్యాధి రోజు రోజుకు విస్తరిస్తోంది. మంగళవారం కొత్తగా 20 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో ఏడాది బాలిక మరణించినట్లు బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. జనవరి 1 నుంచి మంగళవారం వరకు ముంబైలో 220 మీజిల్స్ కేసులు నమోదు కాగా.. 10 మంది మరణించారు.
ముంబైలో మీజిల్స్ వ్యాప్తి దృష్ట్యా తొమ్మిది నెలల నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారులందరికీ వెంటనే టీకాలు వేయించాలని బీఎంసీ కోరింది. ముందు జాగ్రత్తగా అంధేరీలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో 120 పడకలను మీజిల్స్ రోగులకు కేటాయించారు. ఇందులో 100 ఆక్సిజన్ పడకలు, 10 వెంటిలేటర్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ICU) 10 పడకలు ఉన్నాయి.
లక్షణాలు, వ్యాప్తి..
మీజిల్స్ అనేది వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. ఇది మోరిబిలివైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్‌ఫెక్షన్. ఇది మానవులకు మాత్రమే సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు వదిలే శ్వాస బిందువుల ద్వారా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది. చెవులు, ముఖం నుంచి మొదలై పొత్తి కడుపు వరకు దద్దర్లు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం దీని లక్షణాలు. విరేచనాలు, న్యుమోనియా కూడా కొందరిలో ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఐదు శాతం వరకు తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి. టీకాలు వేసుకుని పిల్లల్లో మరణాలు సంభవించే అవకాశం ఉంది.