దేవుడా.. ఒక్క కరోనా పేషంట్‌తో.. 406 మందికి వ్యాప్తి..!
One covid 19 patient can infect 406 people in 30 days.కరోనా సోకిన ఒక వ్యక్తి.. 30 రోజుల్లో సగటున 406 మందికి వైరస్ అంటించే అవకాశం ఉందని హెచ్చరించింది.
By తోట వంశీ కుమార్ Published on 28 March 2021 10:27 AM IST
గతకొద్ది రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, 46 జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రం.. రాష్ట్రాలకు సూచించింది. కరోనా సోకిన ఒక వ్యక్తి.. 30 రోజుల్లో సగటున 406 మందికి వైరస్ అంటించే అవకాశం ఉందని హెచ్చరించింది.
59.8 శాతం కేసులు మహారాష్ట్ర నుంచే..
మహారాష్ట్రలోని 14 జిల్లాల్లో కరోనా తీవ్ర రూపం దాల్చిందని దేశంలో నమోదు అవుతున్న మొత్తం కేసుల్లో 59.8 శాతం కేసులు ఈ జిల్లాల నుంచే వస్తున్నాయన్నారు. 45ఏళ్లుకు పైగా వయసున్న వారిలోనే 90శాతం మరణాలు సంభవిస్తున్నాయని.. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. కొవిడ్ నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు విధించాలని పేర్కొంది.
62 వేల కరోనా కేసులు
కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలీస్తే కొత్తగా నమోదైన కేసుల్లో పెద్దగా తేడా లేనప్పటికి మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 11.81లక్షల పరీక్షలు చేయగా 62,714 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కు చేరింది. కొత్తగా 28,739 మంది వైరస్ బారి నుంచి బయటపడగా.. మొత్తం 1, 13,23,762 మంది కోలుకున్నారు.
కరోనా బాధితులతోపాటు యాక్టివ్ కేసుల సంఖ్యకూడా క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 4,86,310 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 312 మంది కరోనా బాధితులు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1,61,552కి చేరింది. కాగా.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. నిన్నటివరకు 6,02,69,782 మంది కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.