37 రకాల ఔషధాల ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
రోగులకు కేంద్రం ఊరట కల్పించింది. పలు వ్యాధులకు సంబంధించి 37 రకాల ఔషధాల ధరలు తగ్గిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) నిర్ణయం తీసుకుంది.
By అంజి
37 రకాల ఔషధాల ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
రోగులకు కేంద్రం ఊరట కల్పించింది. పలు వ్యాధులకు సంబంధించి 37 రకాల ఔషధాల ధరలు తగ్గిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) నిర్ణయం తీసుకుంది. వీటిలో గుండె జబ్బులు, వాపు, షుగర్, విటమిన్ లోపాలు, ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే మందులు ఉన్నాయి. పారాసిటమాల్, ఆటోర్వాస్టాటిన్, ఆమోక్సిసిలిన్, మెట్‌ఫార్మిన్, ఎసిలోఫెనాక్, పారాసిటమాల్ - ట్రెప్సిన్ కైమోట్రిప్సిన్, సెఫిక్సిమ్ ఓరల్ సస్పెన్షన్ వంటి మందుల ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
37 ముఖ్యమైన ఔషధాలకు ప్రభుత్వం రిటైల్ ధరలను నిర్ణయించింది. 2013 నాటి ఔషధాల (ధరల నియంత్రణ) ఉత్తర్వు (DPCO) నిబంధనల ప్రకారం రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త ధరలు ప్రధాన ఔషధ సంస్థలు ఉత్పత్తి చేసి విక్రయించే 35 ఫార్ములేషన్లకు సంబంధించినవి. వీటిలో కొన్ని తరచుగా సూచించబడే పారాసెటమాల్, అటోర్వాస్టాటిన్, అమోక్సిసిలిన్, మెట్‌ఫార్మిన్ వంటి మందులు, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణలో ఉపయోగించే ఇటీవల ప్రవేశపెట్టిన స్థిర-మోతాదు కలయికలు ఉన్నాయి.
డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ విక్రయించే ఎసిలోఫెనాక్, పారాసిమాల్, ట్రెప్సిన్ కైమోట్రిప్సిన్ కాంబినేషన్ టాబ్లెట్ ధర రూ.13గా నిర్ణయించారు. ఇదే కాంబినేషన్‌తో క్యాడిలా ఫార్మాసూటికల్స్ విక్రయించే టాబ్లెట్ ధరను రూ.15.01గా ఉంటుంది.
గుండె సంబంధిత వ్యాధులున్న వారు వాడే అటోర్వాస్టాటిన్ 40 ఎంజీ+క్లోపిడొగ్రెల్ 75 ఎంజీ టాబ్లెట్ ధరను రూ.25.61గా నిర్ణయించారు. విటమిన్ డీ లోపానికి వాడే కోలికాల్సిఫెరాల్ చుక్కల మందు, చిన్నారులకు వాడే సెఫిక్సిమ్ ఓరల్ సస్పెన్షన్, డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ వంటివి ధరలు తగ్గించిన వాటిలో ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలో కీలకమైన ఎంపాగ్లిప్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్స్ ఒక్కో టాబ్లెట్ ధరను రూ.16.50కి తగ్గించారు.