రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
Notification for Presidential Election 2022 issued.భారతదేశ 16వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సమయం ఆసన్నం అయింది.
By తోట వంశీ కుమార్ Published on 15 Jun 2022 9:50 AM GMTభారతదేశ 16వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సమయం ఆసన్నం అయింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 29 వరకు ఉంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు వచ్చే నెల 2. పోలింగ్ వచ్చే నెల 18న జరుగుతుంది. వచ్చే నెల 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 24తో ముగుస్తుంది. రహస్య బ్యాలట్ విధానంలో ఈ ఎన్నికలు జరుగుతాయి.
లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభల సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు హౌస్, రాష్ట్రాల శాసన సభల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అర్హులు. మొత్తం ఓట్ల విలువ 10,86,431. ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాతో ఉండగా.. దేశంలోని బీజేపీ వ్యతిరేక వర్గం బీజేపీని ఇలాగైనా దెబ్బకొట్టాలని భావిస్తూ ఉంది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్ష నేతలతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం 19 రాజకీయ పార్టీల నేతలను సమావేశానికి మమత ఆహ్వానించారు. వీరిలో విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, హేమంత్ సోరెన్, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే ఉన్నారు.