పెళ్లైన మహిళ ఇంటి పని చేయడం.. క్రూరత్వం కిందకు రాదు: హైకోర్టు

Not cruel to ask married woman to do housework, says Bombay High Court. గృహహింస, క్రూరత్వం కారణంగా చూపుతూ ఓ మహిళ తన భర్తతో విడిపోయింది. ఆ తర్వాత తనను ఇంట్లో పనిమనిషిలా

By అంజి  Published on  28 Oct 2022 4:23 AM GMT
పెళ్లైన మహిళ ఇంటి పని చేయడం.. క్రూరత్వం కిందకు రాదు: హైకోర్టు

గృహహింస, క్రూరత్వం కారణంగా చూపుతూ ఓ మహిళ తన భర్తతో విడిపోయింది. ఆ తర్వాత తనను ఇంట్లో పనిమనిషిలా చూస్తున్నారని తన విడిపోయిన భర్త, అతని తల్లిదండ్రులపై మహిళ కేసు పెట్టింది. ఈ కేసును తాజాగా బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది. వివాహితను కుటుంబానికి ఇంటి పనులు చేయమని అడిగితే, దానిని పని మనిషి పనితో పోల్చలేమని కోర్టు పేర్కొంది. ఇంటి పని క్రూరత్వం కిందకు రాదని చెప్పింది. ఆ వ్యక్తి, అతని తల్లిదండ్రులపై మోపిన ప్రథమ సమాచార నివేదిక లేదా పోలీసు కేసును న్యాయమూర్తులు విభా కంకన్‌వాడి మరియు రాజేష్ పాటిల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

పెళ్లయిన తర్వాత తనతో ఒక నెలపాటు చక్కగా ప్రవర్తించారని, ఆ తర్వాత తనతో పనిమనిషిలా వ్యవహరించారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అదనంగా వివాహం అయిన ఒక నెల తర్వాత, ఆమె భర్త, అతని తల్లిదండ్రులు కారు కొనడానికి 4 లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారని ఆమె పేర్కొంది. ఈ డిమాండ్ కారణంగానే తన భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని మహిళ తన వ్యాజ్యంలో పేర్కొంది. ఆ మహిళ తన ఫిర్యాదులో ఎలాంటి నిర్దిష్ట వేధింపుల చర్యను వివరించలేదని, కేవలం ఆమె వేధింపులకు గురైందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

''పెళ్లయిన స్త్రీని కుటుంబ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఇంటి పని చేయమని అడిగితే, అది పనిమనిషి పనిలా అని చెప్పలేము. ఆమెకు తన ఇంటి పనులు చేయాలనే కోరిక లేకపోతే, ఆమె ముందే చెప్పాలి. పెండ్లికుమారుడు వివాహం గురించి పునరాలోచించవచ్చు లేదా అది వివాహం తర్వాత అయితే, అటువంటి సమస్య ముందుగానే పరిష్కరించబడాలి'' అని కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాకుండా నిర్దిష్ట చర్యలను పేర్కొనకపోతే, కేవలం 'మానసికంగా, శారీరకంగా' వేధింపు అనే పదబంధం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498Aకు వర్తించబడదని పేర్కొంది.

"ఆ చర్యలను వివరించకపోతే, ఆ చర్యలు ఒక వ్యక్తిని వేధింపులకు గురిచేస్తున్నాయా లేదా క్రూరత్వానికి గురిచేస్తున్నాయా అనేది నిర్ధారించలేము" అని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసును కొట్టివేయాలని భర్త,అతని తల్లిదండ్రుల పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. ఈ నిబంధన ప్రకారం భార్య భర్తపై చేసిన ఆరోపణలు నేరంగా పరిగణించబడవని పేర్కొంది.

Next Story