నోరో వైరస్ కలకలం.. 19 మంది విద్యార్థులకు పాజిటివ్
Norovirus Outbreak: 19 students infected in a school in Kerala’s Ernakulam.కేరళ రాష్ట్రంలో నోరో వైరస్ కలకలం
By తోట వంశీ కుమార్ Published on 24 Jan 2023 8:32 AM GMTకేరళ రాష్ట్రంలో నోరో వైరస్ కలకలం రేగుతోంది. ఎర్నాకులం జిల్లాలోని కక్కనాడ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 19 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది.
ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో 62 మంది వాంతులు, డయేరియా లక్షణాలతో బాధపడ్డారు. నోరో వైరస్ అనే అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ఇందులో 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నోరోవైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. నోరో వ్యాప్తి నేపథ్యంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.
మురుగునీటి ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది అంటువ్యాధి. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులకు ఇది సోకితే పెద్దగా ప్రమాదం ఏమీ ఉండకపోయినా, చిన్న పిల్లలు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సోకితే ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
నోరోవైరస్ అంటే ఏమిటి?
నోరోవైరస్ అనేది అంటువ్యాధి. దీనిని కొన్నిసార్లు "కడుపు ఫ్లూ" లేదా "శీతాకాలపు వాంతులు బగ్" అని పిలుస్తారు. కలుషితమైన ఆహారం, నీరు ఆహారం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత రెండు రోజుల్లోనే వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు మొదలవుతాయి. వికారం, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉండొచ్చు.