పార్లమెంట్ క్యాంటీన్ ఆహార పదార్థాలపై రాయితీ ఎత్తివేత.. కొత్త జాబితా విడుదల
Non Veg Buffet At Rs 700 Parliament Canteen Sheds Subsidy.లోక్‌సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూడిన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 28 Jan 2021 7:35 PM ISTదశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్‌లో సభ్యులకు అందిస్తున్న రాయితీల విషయంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్. లోక్‌సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూడిన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. కొత్త మెనూలో ధరల పెరుగుదల కనిపించింది. గతంలో సబ్సిడీ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే జనవరి 29 నుంచి కొత్త మెనూ ప్రకారం పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.
శాఖాహార భోజనానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఉడకబెట్టిన కూరగాయల ధర రూ.12 ఉండగా, ఇప్పుడు రూ.50కి పెంచారు. పార్లమెంట్ క్యాంటీన్‌లో హైదరాబాద్ మటన్ బిర్యానీ రూ.65కే ఉండేది. ఇప్పుడది రూ.150కి పెంచారు. ఇక చపాతీ ధర రూ.3 ఉండగా, ఇప్పుడు నాన్ వెజ్ బఫే కావాలంటే రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. మెనూలో అత్యధికంగా ధర కలిగినది వెజ్‌బఫే.. ఇది రూ.500 ఉంది. కాగా, ఈసారి రాయితీలు ఎత్తివేయడంతో ఏటా రూ.8 కోట్ల ఆదా కానున్నట్లు అంచనా వేస్తోంది. ఈ క్యాంటిన్‌ను ఇండియా టూరిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించనుందని లోకసభ స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు.
గత 52 ఏళ్లుగా పార్లమెంట్ సభ్యులకు ఇండియన్ రైల్వేస్ ఆహారాన్ని అందజేస్తోంది. పార్లమెంట్ ప్రాంగణంలోని క్యాంటీన్లు, కిచెన్ల నుంచి తప్పుకునేందుకు రైల్వేశాఖ సిద్దమైంది. 1968 నుంచి పార్లమెంట్ క్యాంటీన్ ద్వారా ఎంపీలకు ఆహారాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఈ క్యాంటీన్ ద్వారా ప్రతి పార్లమెంట్ సెషన్‌లో సుమారు 5 వేల మందికి ఆహారాన్ని అందజేస్తున్నారు. క్యాంటీన్ మెనూలో భోజనం, సాయంత్రం స్నాక్స్ కోసం మొత్తం 48 ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పార్లమెంట్ సభ్యులకు భోజనం అందించనుంది. అయితే ఇది వరకు ఇచ్చిన రాయితీలను ఎత్తివేయడంతో క్యాంటీన్ భోజనం ధరలు కాస్త పెరిగిపోనున్నాయి.