జంక్ ఫుడ్ తిని ఇద్దరికి అస్వస్థత
మెక్ డొనాల్డ్స్, థియోబ్రోమలో బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి అవి తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 30 April 2024 2:45 PM ISTజంక్ ఫుడ్ తిని ఇద్దరికి అస్వస్థత
చాలా వరకు ప్రజలు హోటళ్లలో భోజనాలు చేస్తుంటారు. ఇంకొన్ని రెస్టారెంట్స్‌లో స్నాక్స్‌తో పాటు జంక్ ఫుడ్ దొరుకుతుంటుంది. ఇలాంటి వాటికి బాగా గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా సహా ఇతర జంక్ ఫుడ్ ఇష్టంగా తింటారు. చిన్నా చితక హోటళ్లలో అయితే ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించరు కానీ.. ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న వాటిల్లో అయితే కచ్చితంగా ప్రమాణాలను పాటిస్తారు. కానీ.. తాజాగా ఇద్దరు వ్యక్తులు మంచి పేరు ఉన్న మెక్ డొనాల్డ్స్, థియోబ్రోమలో బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి అవి తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు.
ఈ రెండు సంఘటనలు నోయిడాలో చోటుచేసుకున్నాయి. మెక్ డొనాల్డ్స్‌లో ఒకరు, థియోబ్రోమలో మరొకరు ఫుడ్ ఆర్డర్ చేసి అస్వస్థతకు లోనయ్యారు. నోయిడా సెక్టార్ 18లో ఉన్న మెక్ డొనాల్డ్స్‌లో ఒక వ్యక్తి ఆలు టిక్కీ, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి తిన్నాడు. ఆ తర్వాత ఉన్నట్లుండి అతను అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో.. సదురు వ్యక్తి మెక్ డొనాల్డ్స్‌లో ఫుడ్ తిన్న తర్వాతే అనారోగ్యానికి గురైనట్లు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని కంప్లైంట్‌పై ఫుడ్ సేఫ్ఠీ అధికారులు విచారణ జరిపారు. ఈ మేరకు అధికారులు శాంపిల్ సేకరించామనీ.. ఫామ్ ఆయిల్ వాడారని తేలినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి అర్చన ధీరన్ వెల్లడించారు.
ఇలాంటి సంఘటనే మరోటి నోయిడాలో జరిగింది. నోయిడా సెక్టార్ 104లో ఉన్న థియోబ్రోమ బేకరి నుంచి ఓ మహిళ పైనాపిల్ కేక్‌ను ఆర్డర్ పెట్టారు. ఆ తర్వాత దాన్ని తిన్న సదురు మహిళ అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఫిర్యాదు ను స్వీకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా శాంపిల్ సేకరించారు. ఆ తర్వాత ల్యాబ్‌కు పంపారు. దీని గురించి రిపోర్ట్ రావడానికి సమయం పడుతుందనీ.. కేక్ తయారీలో బేకరి తప్పిదం ఉందని రిపోర్టు వస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు.