ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో, ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించింది. తీహార్ జైలు నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. సీబీఐ విచారిస్తున్న అవినీతి కేసులో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జూలై 31న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ సీఎంను హాజరుపరచాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ నాయకురాలు కె.కవిత, ఇతర నిందితుల జ్యుడీషియల్ కస్టడీని కూడా కోర్టు పొడిగించింది. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఎక్సైజ్ పాలసీ ఏర్పాటు, అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసులో సీబీఐ అరెస్టు చేసిన కారణంగా ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు.