ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద 'క్యాష్' బంద్.. కొత్త రూల్స్ ఇవే!
ఏప్రిల్ 10 నుంచి టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు కానున్నాయి. FASTag లేదా UPI ద్వారానే పేమెంట్స్ చేయాలి.
By - అంజి |
ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద 'క్యాష్' బంద్.. కొత్త రూల్స్ ఇవే!
ఏప్రిల్ 10 నుంచి టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు కానున్నాయి. FASTag లేదా UPI ద్వారానే పేమెంట్స్ చేయాలి. యూపీఐతో చేస్తే 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లు పని చేయకపోతే వాహనదారుడికి 'ఈ నోటీస్' వస్తుంది. 72 గంటల్లోపు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే అదనపు ఫీజు ఉండదు. ఆ తర్వాత అయితే డబుల్ టోల్ కట్టాలి. 15 రోజులు దాటితే VAHAN సిస్టమ్ ద్వారా కఠిన చర్యలు తప్పవు.
దేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఇకపై తమ జేబుల్లో చిల్లర కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 10, 2026 నుండి నేషనల్ హైవే టోల్ బూత్‌ల వద్ద నగదును అస్సలు అంగీకరించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద కేవలం FASTag లేదా UPI ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లను నివారించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒకవేళ మీ వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేదా అది పని చేయకపోయినా.. ప్రత్యామ్నాయంగా యూపీఐ (UPI) ద్వారా చెల్లింపు చేయవచ్చు. అయితే, సాధారణ టోల్ ధర కంటే 1.25 రెట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అసలు డిజిటల్ పద్ధతిలో చెల్లించనని మంకుపట్టు పట్టే వారికి రూల్ 14 ప్రకారం ఆ రోడ్డుపైకి ప్రవేశాన్ని నిరాకరించే అధికారం అథారిటీకి ఉంటుంది. అంతేకాకుండా, బకాయి ఉన్న టోల్ కోసం ఈ-నోటీసు జారీ చేస్తారు. మూడు రోజుల్లోగా దానిని చెల్లించకపోతే పెనాల్టీ రెట్టింపు అవుతుంది.
ఈ కొత్త నిబంధనల వల్ల 'ఐడీ కార్డుల' విన్యాసాలకు కూడా చెక్ పడనుంది. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు, రక్షణ సిబ్బంది తమ సొంత వాహనాల్లో వెళ్లేటప్పుడు కూడా ఐడీ కార్డులు చూపి టోల్ కట్టకుండా వెళ్లేవారు. ఇది చట్టవిరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం అర్హత ఉన్న వాహనాలకు మాత్రమే 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' (Exempted FASTag) తీసుకోవాలని సూచించింది. తరచుగా ప్రయాణించే వారి కోసం రూ. 3,075 కే 'FASTag యాన్యువల్ పాస్' సౌకర్యాన్ని కల్పించారు. భవిష్యత్తులో వాహనాలు అస్సలు ఆగకుండా, కెమెరాలు మరియు RFID రీడర్ల ద్వారా ఆటోమేటిక్‌గా టోల్ కట్ అయ్యే 'బారియర్-ఫ్రీ' విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఈ నగదు రహిత నిర్ణయం తొలి అడుగుగా నిలుస్తుంది.