కరోనా థర్డ్ వేవ్.. పిల్లలపై ప్రభావం తక్కువే..!
No evidence of severe illness among children in third wave.కరోనా మహమ్మారి మూడో వేవ్‌లో చిన్నారులకు భారీగా
By తోట వంశీ కుమార్ Published on 13 Jun 2021 9:14 AM ISTమూడో వేవ్‌లో చిన్నారులకు భారీగా ముప్పు ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ అభిప్రాయాలు వాస్తవం కాకపోవచ్చునని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. కరోనా థర్డ్‌వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేందుకు ఇంతవరకు సరైన ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. భారత్‌లో పిల్లలకు కరోనా ముప్పు పేరుతో ది లాన్సెట్ కొవిడ్-19 కమిషన్, ఇండియన్ టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా.. పిల్లల వైద్య నిపుణులు నివేదికను రూపొందించారు. థర్డ్ వేవ్‌లో కేవలం పిల్లలకే అధిక ముప్పు ఉంటుందన్నది సరికాదని నిపుణులు పేర్కొన్నారు. అందరిలాగే వారికి ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
చాలా మంది చిన్నారుల్లో వైరస్ లక్షణాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా అవి స్వల్పంగానే ఉంటాయి. ఎక్కువ మంది జర్వం, శ్వాస సమస్య, విరేచనాలు, వాంతులు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వయసు పెరిగే కొద్దీ వైరస్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని పది ఆసుపత్రుల్లో చికిత్స పొందిన చిన్నారులపై అధ్యయనం సాగింది. 2,600 మంది చిన్నారుల చికిత్సలను అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు పిల్లల వైద్య నిపుణులతో అధ్యయనం నివేదిక తయారు చేశారు.
'కరోనా సోకిన పిల్లల్లో 2.4శాతం మరణాలు సంభవించాయి. అదే ఇతర రోగాలకు గురైన వారిలో 40శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చేరిన చిన్నారుల్లో 9 శాతం మందే తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యారు. దీని ప్రకారం చూస్తే.. చిన్నారులకు ఉండే ముప్పు తక్కువేనని తెలుస్తోంది. వైరస్ సోకిన పిల్లలో 5 శాతం మందికే ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. వారిలో 2 శాతం మందికి వ్యాధి తీవ్రమై మరణించే ముప్పు కలగవచ్చు. అంటే లక్ష మందిలో 500 మందే ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది. వారిలో 2 శాతం అంటే లక్ష మందిలో ఒకరిద్దరు మాత్రమే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇతరత్రా వ్యాధులు లేకపోతే పిల్లల్లో మరణాలు ఉండకపోవచ్చు' అని నివేదికలో పేర్కోన్నారు.