మనకి కైలాస యాత్ర క్యాన్సిల్ చేసిన నిత్యానంద..

Nithyananda Bans Indians From Travelling To Kailasa. నిత్యానంద తన కోసం, తన ప్రియమైన భక్తుల కోసం నిర్మించుకున్న కైలాస ద్వీపానికి భారతీయులకు అనుమతిని నిరాకరిస్తూ ఆదేశం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2021 2:33 AM GMT
Nithyananda

స్వయం ప్రకటిత దేవుడు, అత్యాచార‌ కేసు నిందితుడు, ఇండియా నుంచి పారిపోయిన ట్రిపుల్ ఎక్స్ స్వామి నిత్యానంద మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. తన కోసం, తన ప్రియమైన భక్తుల కోసం నిర్మించుకున్న కైలాస ద్వీపానికి భారతీయులకు అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలివ్వడమే అందుకు కారణం. మనతో పాటుగా బ్రెజిల్, ఐరోపా సంఘం, మలేసియా దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు తన ప్రెసిడెన్షియల్ మ్యాండేట్‌లో ప్రకటించారు. పలు దేశాల్లో కరోనా విజృంభిస్తోన్న తరుణంలో.. తన దేశాన్ని రక్షించుకునేందుకు ట్విటర్ వేదికగా ఈ ప్రకటన చేశారు.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్వామీజీ..2019లో భారత్‌ను వదిలిపారిపోయారు. అప్పటినుంచి ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈక్వెడార్ మాత్రం ఆ వార్తలను తోసిపుచ్చింది. కాగా.. నిత్యానంద తాను ఉంటున్న ద్వీపాన్ని 'కైలాస' అని చెప్తుండటంతో పాటు, దానికి అధినేతగానూ ప్రకటించుకున్నారు. అంతేకాకుండా కైలాసను పత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా చేసుకున్నారు.

అతను ఈ నిర్ణయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడేమో గానీ ట్విటర్లో నిత్యానంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. రకరకాల ఈమోజీలతో ఈ ప్రకటనను రీట్వీట్ చేస్తూ నవ్వుల టపాసులు పేలుస్తున్నారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. అందరమూ బతకడం ఎలా, భవిష్యత్తు మీద భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఇలాంటి సమయంలో మన ముఖం మీద నవ్వులు పువ్వులు పూయించాడు నిత్యానంద..కాదంటారా...


Next Story
Share it