నేడే బడ్జెట్.. మధ్యతరగతి ప్రజలకి ఊరట..!
Nirmala Sitharaman to present Union Budget in Parliament today.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం
By తోట వంశీ కుమార్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు(మంగళవారం) ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా నాలుగోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పేపర్ లెస్‌గా ఈ బడ్జెట్ ఉండనుంది. బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలమ్మ ట్యాబ్ చూసే చదవనున్నారు. ముందుగా ఉదయం 9.30గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలవనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం ఇవ్వనున్నారు. అనంతరం ఉదయం 10.10 గంటలకు పార్లమెంట్ లో కేంద్ర కేబినేట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో 2022-23 వార్షిక బడ్జెకు కేబినేట్ ఆమోదం తెలపనుంది. కేబినేట్ ఆమోదం పొందిన తరువాత నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
ఇక ఈ బడ్జెట్‌లో తమకు ఊరట కల్పిస్తారని, ఉపశమన చర్యలు ఉంటాయని అన్ని రంగాలు మొదలుకుని దేశంలోని సామాన్యులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 80సీ కింద పన్ను మినహాయింపులపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సెక్షన్ 80సీ కింద గరిష్టంగా ఇస్తున్న రూ.1.50లక్షల మినహాయింపుల పరిమితిని రూ.3లక్షలకు పెంచాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. 80సీ కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.1.50లక్షల మినహాయింపులను సవరించక చాలా సంవత్సరాలు అవుతోందని అంటున్నారు.
ఈ సారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో మొత్తం నిధులు రూ.40 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్ కంటే మొత్తం నిధులు 14శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో అత్యధిక ప్రయోజనం ఉత్పాదక రంగానికే లభిస్తుందని, ఆ తర్వాత సేవలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారని విశ్లేషిస్తున్నారు. రియల్ ఎస్టేల్ రంగానికి ఊపునిచ్చే విధంగా పరిశ్రమ హోదా కల్పించడం, పన్ను రాయితీలు వంటి అనేక చర్యలు ఉండవచ్చునని ఊహాగాలు వెలువడుతున్నాయి. బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ది, ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసే అవకాశాలున్నాయి. ఎరువుల సబ్సిడీలు, ఉపాధి కల్పనను పెంచేందుకు, మౌలిక సదుపాయాల రంగానికి భారీ కేటాయింపులు ప్రకటించడం వంటివి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆరోగ్యానికి జీడీపీలో 3 శాతం కేటాయింపులు ఉండొచ్చని అంటున్నారు. కరోనా మూడో వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఈ సారి బడ్జెట్‌పై సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు చాలా ఆశలే పెట్టుకున్నారు.