ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచే రాత్రి కర్ఫ్యూ
Night Curfew Starts from Tomorrow In UP.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్‌లోనూ
By తోట వంశీ కుమార్ Published on 24 Dec 2021 8:34 AM GMTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్‌లోనూ ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శుక్రవారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 358 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండడంతో ఈ మహమ్మారి మరింతగా విజృంభించే అవకాశం ఉండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షల దిశగా నడుస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రం రాత్రి కర్ఫ్యూపై ప్రకటన చేయగా.. తాజాగా ఆ జాబితాలోకి ఉత్తరప్రదేశ్ కూడా చేరింది.
ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. డిసెంబర్ 25( శనివారం) నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుందని.. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అది కొనసాగునున్నట్లు చెప్పింది. అలాగే వివాహా వేడుకలకు 200 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనలను ప్రజలంతా తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.
యూపీలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కోరిన మరుసటి రోజే.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ ఆదేశాలను జారీ చేయడం గమనార్హం. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్‌లో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిద్దరూ కోలుకున్నారు. ఇక గురువారం ఉత్తరప్రదేశ్‌లో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరోనా పరిస్థితులపై ప్రధాని సమీక్ష..
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా పరిస్థితులపై గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత సమయంలో అందరం అప్రమత్తంగా, జాగరుకతతో ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు.