అరెస్టైన పోలీస్ అధికారి సచిన్ వాజే సమక్షంలో మిథి నదిలో ఎన్ఐఏ సోదాలు.. ఏం దొరికాయంటే..

NIA takes Sachin Waze to the bridge over Mithi river. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం సమీపంలోని ఒక కారులోపేలుడు కేసులో అరెస్టయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే

By Medi Samrat  Published on  29 March 2021 10:07 AM IST
NIA takes Sachin Waze to the bridge over Mithi river.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం సమీపంలోని ఒక కారులో పేలుడు పదార్ధాలు ఉంచిన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చురుకుగా సాగుతోంది. రోజులు గడిచేకొద్ది కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి.ఈ కేసులో అరెస్టయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే సమక్షంలో ఎన్ఐఏ ఆదివారంనాడు కీలక ఆధారాలను చేజిక్కించుకుంది. వాజేతో కలిసి ముంబై బాంద్రాలోని మిథి రీవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఆయన ఇచ్చిన ఆధారాలతో గజ ఈతగాళ్లను రంగంలోకి దిగింది.

నదిలోకి దిగిన ఈతగాళ్లు రెండు కంప్యూటర్ సీపీయూలు, ఒక ల్యాప్‌ట్యాప్, హార్డ్‌డిస్క్, ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉన్న రెండు నెంబర్ ప్లేట్లు, ఇతర వస్తువులు వెలికితీశారు. ఈ హార్డ్ డిస్క్ ను నాశనం చేయాలని భావించిన సచిన్ వాజే దానితో పాటుగా కారు నెంబర్ ప్లేట్లను నదిలో విసిరేసినట్లు అధికారులకు విచారణలో తెలిపారు.. దీంతో వాజేను తీసుకుని వెళ్లి ఎక్కడ పడేసారో తెలుసుకొని గజ ఈతగాళ్ళ సహాయంతో వాటిని బయటకు తీశారు. ఈ పరిణామంతో కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్టేనని, మొత్తం కుట్ర సచిన్ వాజే నేతృత్వంలోనే జరిగిందనడానికి ఇది కీలకమని అధికారులు భావిస్తున్నారు.

అంబానీ నివాసమైన సౌత్ ముంబై హోమ్ ఆంటిలియా సమీపంలో గత ఫిబ్రవరి 25న ఒక స్కార్ఫియో నిలిపి ఉండటం, అందులో 20 జెలిటెన్ స్టిక్‌లు, బెదరింపు లేఖ కనిపించడం సంచలనం సృష్టించింది. పేలుడు పదార్ధాలు నింపిన ఎస్‌యూవీ యజమాని మన్‌సుఖ్ హిరాన్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో మార్చి 13న వాజేను ఎన్ఐఏ అరెస్టు చేసింది. తన కారును దొంగిలించారంటూ ఫిబ్రవరి 17న ఫిర్యాదు చేసిన హిరాన్ మార్చి 5న థానేలోని క్రీక్‌లో విగతజీవుడై కనిపించాడు. తన భర్త గత నవంబర్‌లో ఎస్‌యూవీని వాజేకు ఇచ్చినట్టు మృతుని భార్య పేర్కొంది.

ఈ క్రమంలో క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీఐయూ)‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న వాజేను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వాజే ఉద్యోగంపై సస్పెన్షన్ వేటు పడింది. ఏప్రిల్ 3 వరకూ ఆయన కస్టడీలోనే ఉంటారు. అంతకుముందు అంటే గురువారం నాడు ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సచిన్ వాజే ఇంట్లో లెక్క చూపని 62 బుల్లెట్లను కనుగొన్నామని పేర్కొన్నారు. సర్వీస్ రివాల్వర్ కోసం 30 బుల్లెట్లను ఇచ్చారని వాటిలో కేవలం 5 మాత్రమే రికవర్ అయ్యాయని మిగతావి లెక్క తేలడం లేదని కూడా విచారణ అధికారులు తెలిపారు.





Next Story