సచిన్ వాజే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
NIA has arrested Mumbai police officer Sachin Vaze. ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ముంబైలోని కార్యాలయంలో పలు ప్రశ్నలు సంధించారు.
By Medi Samrat Published on 15 March 2021 2:29 PM ISTముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ముంబైలోని కార్యాలయంలో పలు ప్రశ్నలు సంధించారు. అంబానీ ఇంటివద్ద ఓ వాహనంలో పేలుడు పదార్థాల వాహనం ఉండడం, ఆ తరువాత ఆ వాహన యజమానిగా చెబుతున్న ఆటో స్పేర్ పార్టుల డీలర్ మాన్ సుఖ్ హిరేన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం పెద్ద సంచలనం అయింది.
తన భర్త మరణానికి సచిన్ వాజే కేరణమని, ఆయన వేధింపుల వల్లే తన భర్త మృతి చెందాడని సుఖ్ హిరేన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్.. ఈ కేసు దర్యాప్తు ముగిసేవరకు వాజేని తొలగిస్తున్నట్టు ప్రకటించారు. వాజే శనివారం ఓ వాట్సాప్ స్టేటస్ పెడుతూ తనను ఈ కేసులో తప్పుడుగా ఇరికించారని ఆరోపించారు. ఈ ప్రపంచానికి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. 2004 లో తనకు కలిగిన ఓ అనుభవాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాడు ఓ కేసులో తన తోటి అధికారులే తనను ఇరికించారని, అది ఇప్పటివరకు తేలలేదని తెలిపారు.
ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో వాజే అక్కడే ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. పీపీఈ కిట్ ధరించిన ఓ వ్యక్తి స్కార్పియోను అక్కడ నిలిపినట్లు గుర్తించారు. అయితే, ఆ పీపీఈ కిట్ వేసుకున్న వ్యక్తి సచిన్ వాజేనేనా? లేదా మరో వ్యక్తా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌లతో పాటు వాజే వివరణకు కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. వాజేను గత శనివారం రాత్రి ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఆదివారం కోర్టులో హాజరుపర్చగా.. ఈనెల 25 వరకు కస్టడీ విధించింది. అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం (స్కార్పియో) కేసుకు సంబంధించి ఓ తెలుపు రంగు ఇన్నోవా కారును ఎన్‌ఐఏ ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలున్న వాహనాన్ని అనుసరించిన కారు ఇదేనా? కాదా అన్నది తేలాల్సి ఉంది.