స్టాంప్ పేపర్లపై అమ్మాయిల అమ్మకం నిజమే: NHRC
న్యూఢిల్లీ: ప్రతి రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధక శాఖకు నోడల్ అధికారి ఉండాలని NHRC సిఫార్సు చేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Jun 2024 5:38 AM GMTస్టాంప్ పేపర్లపై అమ్మాయిల అమ్మకం నిజమే: NHRC
న్యూఢిల్లీ: ప్రతి రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధక శాఖకు నోడల్ అధికారి ఉండాలని NHRC సిఫార్సు చేసింది. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ అధికారి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి లేదా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువగా ఉండకూడదని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఒక ప్రకటనలో తెలిపింది.
రాజస్థాన్‌లోని జిల్లాల్లో స్టాంప్ పేపర్‌పై అమ్మాయిలను అమ్ముతున్నారని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లకు వారిని పంపుతున్నారని మీడియా కథనం ఆధారంగా అక్టోబర్ 2022లో సుమోటో కేసు నమోదవ్వగా.. అందుకు సంబంధించి కమిషన్ నుండి పలు సిఫార్సులు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్, ముంబై, ఢిల్లీ.. నుండి అక్రమ రవాణా జరుగుతూ ఉందని.. విదేశాలకు పంపించిన వారిని బానిసలుగా చేసుకోవడమే కాకుండా, శారీరక వేధింపులు, హింసలు, లైంగిక వేధింపులకు గురవుతున్నారని తేలింది. ఇక ముంబై బార్‌లలోని మహిళా డ్యాన్సర్లను రాజస్థాన్ నుండి అక్రమ రవాణా చేశారని.. వారిని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టారని కూడా కమిషన్ తన నివేదికలో పంచుకుంది. బార్లలో అమ్మాయిల కష్టాలను తెలుసుకోవడానికి ముంబైకి దర్యాప్తు కోసం ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయికి తగ్గని అధికారి నేతృత్వంలోని బృందాన్ని పంపాలని రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించింది.
ఈ విషయంలో రాజస్థాన్ పోలీసులకు సహాయం అందించాలని కమిషన్ మహారాష్ట్ర డీజీపీని కూడా కోరింది. అటువంటి సంఘటనలు జరగకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, వారి సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చేలా చూసేందుకు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి కమిటీలు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా వారి పునరావాస ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు ఆడపిల్లల అమ్మకాలకు సంబంధించిన కేసులను కూడా పరిశీలించింది. కొందరు అమ్మాయిలను అమ్మేయడానికి కొనసాగిస్తూ ఉన్నారని.. ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతోందని కూడా తెలిపారు. ఇలాంటి వాటిని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని, అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని NHRC కోరింది. గతంలో ఈ విషయంలో ప్రత్యేక రిపోర్టర్‌తో పాటు రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ నుండి నివేదికలు కూడా కమీషన్ కోరింది.
ఇక రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను ధృవీకరించింది. 23 మంది నిందితులపై చార్జ్ షీట్ దాఖలు చేసింది. అక్రమ రవాణాకు గురైన ఏడుగురు బాలికలకు అజ్మీర్‌లోని నారీ నికేతన్ గర్ల్స్ రిఫార్మ్ హోమ్‌లో పునరావాసం కల్పించామని తెలిపింది. స్పెషల్ రిపోర్టర్ నివేదిక ప్రకారం.. స్టాంప్ పేపర్లపై మహిళలను విక్రయించడం అనేది పురుషాధిక్య కంజర్ కమ్యూనిటీలో ప్రబలమైన ఆచారమని తేలింది. అలా కొనుక్కుని ఏకంగా సెక్స్ ట్రేడ్‌లోకి బలవంతంగా నెట్టబడ్డారని హక్కుల ప్యానెల్ పేర్కొంది. ఇలాంటి వాటిని అరికట్టడానికి, కమిషన్ అన్ని రాష్ట్రాలకు మానవ అక్రమ రవాణా నిరోధక నోడల్ అధికారిని కలిగి ఉండాలని సిఫార్సు చేసింది. వారు జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు (DAHTU)తో పాటూ సంబంధిత రాష్ట్ర అధికారులతో సమన్వయం చేస్తూ ఉండాలని కమీషన్ పేర్కొంది.
మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం, కార్మిక ఉపాధి శాఖల ప్రతినిధులు, స్థానిక ఎన్‌జిఓలు, మానవ అక్రమ రవాణా రంగంలో నిపుణులు, జిల్లాలోని న్యాయ సలహాదారుల సహాయంతో నోడల్ అధికారి ఇటువంటి సంఘటనలను సమర్థవంతంగా పర్యవేక్షించాలని NHRC సూచించింది.మానవ అక్రమ రవాణాకు సంబంధించి పలు ప్రాంతాలను తనిఖీ చేయడం, బాధితుల పునరావాసంతో సహా DAHTUల వివిధ విధులను సిఫార్సు చేస్తూ, ఎనిమిది వారాల్లోగా సమ్మతిపై నివేదికలు సమర్పించాలని కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.