రానున్న 40 రోజులు చాలా కీలకం.. జనవరిలో భారత్‌లో కరోనా విజృంభించే అవకాశం..!
Next 40 days crucial as India may see surge in Covid cases in January.రానున్న 40 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన
By తోట వంశీ కుమార్ Published on 29 Dec 2022 8:36 AM ISTరానున్న 40 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. జనవరిలో భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చైనాతో పాటు పలు దేశాల్లో బీఎఫ్ 7 వేరియంట్ విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే రద్దీ ప్రదేశాల్లో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించిన సంగతి తెలిసిందే.
గత అనుభవాల ఆధారంగా కొవిడ్ కొత్త వేవ్‌లు తూర్పు ఆసియాలో మొదలైన 30-35 రోజుల తరువాత మన దేశాన్ని తాకాయని ఓ అధికారి తెలిపారు. అయితే.. ఈ సారి కరోనా వైరస్ తీవ్రత అంతగా ఉండదని అంటున్నారు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్యతో పాటు మరణించే వారి సంఖ్య స్వల్పంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గత రెండు రోజులుగా విదేశాల నుంచి దాదాపు 6వేల మంది ప్రయాణీకులకు ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేయగా 39 మందికి పాజిటివ్‌గా వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని విమానాశ్రయాన్ని కేంద్ర మంత్రి మాండవీయ గురువారం సందర్శించనున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. గత శనివారం నుంచి ప్రతి అంతర్జాతీయ విమానంలో వచ్చే రెండు శాతం మంది ప్రయాణికులకు ప్రభుత్వం యాదృచ్ఛిక కరోనావైరస్ పరీక్షను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, బ్యాంకాక్ మరియు సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణీకులు కొవిడ్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాలనే నిబంధనను తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సువిధ ఫామ్‌లు నింపడం, 72 గంటల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు సమర్పించడం వచ్చే వారం నుంచి తేనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. మన దేశంలో ప్రస్తుతం 3,468 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతం ఉండగా, రోజువారి పాజిటివిటీ రేటు 0.14 శాతంగా ఉంది. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.