2024 మార్చి తర్వాత పాత రూ.100 నోట్లు చెల్లవా? ఆర్బీఐ క్లారిటీ!

పెద్ద నోట్ల రద్దు భారత్‌ను ఒక్క కుదుపు కుదిపేసింది.

By Srikanth Gundamalla  Published on  30 Dec 2023 2:28 AM GMT
rbi, old rs.100 notes, social media,

2024 మార్చి తర్వాత పాత రూ.100 నోట్లు చెల్లవా? ఆర్బీఐ క్లారిటీ! 

పెద్ద నోట్ల రద్దు భారత్‌ను ఒక్క కుదుపు కుదిపేసింది. దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతి సొమ్మును బయటపెడతామని కేంద్రం చెప్పినా.. అది ఎంతమాత్రం జరగలేదు. రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని కేంద్రం నిర్ణయం తీసుకన్న తర్వాత ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత వాటి స్థానంలో కేంద్రం కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చింది. కొన్నాళ్లకు మళ్లీ కేంద్రం రూ.2000 నోటును కూడా రద్దు చేసింది. అయితే.. ఈ సారి ప్రజలు అంత ఇబ్బందులు పడలేదు. ఎందుకంటే ఎవరి దగ్గరా పెద్దమొత్తం రూ.2000 నోట్లు లేవు కాబట్టి.

కాగా... తాజాగా ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. రాబోయే ఏడాది 2024 మార్చి తర్వాత పాత రూ.100 నోటు చెల్లదని అంటున్నారు. దీనికి తోడు కొందరు దుకాణాదారులు కూడా పాత రూ.100 నోటును తీసుకునేందుకు కాస్త వెనకాడుతున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో పానీపూరీ వ్యాపారం చేస్తున్న వ్యక్తి రూ.100 తీసుకునేందుకు నిరాకరించాడని రాసుకొచ్చాడు. కొందరు అయితే.. ఏకంగా 2024 మార్చి 31 తర్వాత పాత రూ.100 నోట్లు చెల్లవని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

చాలా మంది చిరువ్యాపారులు, దుకాణాదారులు ఈ నోట్లను తీసుకునేందుకు వెనకాడుతున్నారు. పాత రూ.100 నోట్లను రద్దు చేస్తూ ఆదేశాలు ఉన్నాయా అని అందరూ సోషల్‌ మీడియాలో ఆర్బీఐని ట్యాగ్‌ చేస్తున్నారు. ఇంకొందరు అయితే గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని వెల్లడించింది. ఇవన్నీ సోషల్‌ మీడియాలో వస్తోన్న పుకార్లు అన్ని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వార్తలను నమ్మొద్దని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆర్బీఐ స్పందనతో రూ.100 నోట్లపై వస్తున్న వార్తలు అవాస్తవమని క్లారిటీ వచ్చింది.


Next Story