వ్యాక్సినేషన్‌కు కొత్త రూల్స్..!
New Vaccine rules suggeted by experts panel. భారత్‌లో కరోనా టీకాకు సంబంధించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) కేంద్రానికి పలు కీలక సిఫార్సులు చేసినట్టు సమాచారం.
By తోట వంశీ కుమార్ Published on 13 May 2021 4:05 PM ISTభారత్‌లో కరోనా టీకాకు సంబంధించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) కేంద్రానికి పలు కీలక సిఫార్సులు చేసినట్టు సమాచారం. కరోనా నుంచి కోలుకున్న 6 నెలల తర్వాత టీకా తీసుకోవాలని, ప్రసవం తర్వాత ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని పేర్కొంది. గర్భిణులు కూడా వారి ఇష్టం ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవచ్చునని తెలిపింది.
ఎన్టీఏజీఐ చేసిన సిఫార్సులు ఇవే..
- కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి పెంచాలని ఎన్టీఏజీఐ సూచించింది. 12-16 వారాల వ్యవధి ఉండాలని పేర్కొంది. గతంలో ఇది 4-8 వారాలుగా ఉంది. అయితే.. కొవాగ్జిన్ టీకాల విషయంలో ఎన్టీఐజీఐ ఎలాంటి సూచనలు చేయలేదు. ప్రస్తుతం ఉన్న వ్యవధి (4-8 వారాలు) కొనసాగుతుంది.
- వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చిన తర్వాత కరోనా సోకితే.. వారికి కోలుకున్న 4-8 వారాల తర్వాత రెండవ డోస్ ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు కోలుకున్న 14 రోజుల తర్వాత రెండవ డోస్ ఇస్తున్నారు.
- కరోనా రోగులకు కోలుకున్న ఆరు నెలల తర్వాత టీకాలు వేయాలి. ప్రస్తుతం, కోలుకున్న రోగులకు 14 రోజుల తర్వాత మొదటి డోస్ ఇస్తున్నారు. ఆరు నెలల తర్వాత టీకాలు ఇచ్చినట్లయితే.. శరీరంలో ఉత్పత్తి అయ్యే సహజమైన యాంటీబాడీల కార్యాచరణను పెంచే అవకాశం ఉంది.
- గర్భిణీలు టీకా తీసుకునేందుకు ఇప్పటివరకు అనుమతి లేదు. తాజాగా.. వారికీ టీకా అందించవచ్చని ఎన్టీఏజీఐ సూచించింది. అంతే కాకుండా.. రెండు టీకాల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటును కూడా ఇచ్చింది. అయితే టీకాల వల్ల కలిగే నష్టాలు, లాభాలను వారికి స్పష్టంగా చెప్పాలని పేర్కొంది. ఇక డెలివరీ తర్వాత బాలింతలు ఎప్పుడైనా టీకాలు తీసుకోవచ్చునని తెలిపింది.
- ఇతర దీర్ఘకాలిక రోగాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత టీకా ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు ప్రత్యేక ప్రోటోకాల్ లేదు. దుష్ప్రభావాలు లేకుండా ఉండాలంటే వ్యాక్సిన్‌కు గ్యాప్ తప్పనిసరి అంటున్నారు. టీకా వేయించుకునే ముందు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అవసరం లేదు.
- చికిత్స సమయంలో ప్లాస్మా థెరపీ చేసిన రోగులకు కోలుకున్న 12 వారాల తర్వాత వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ పేషెంట్స్‌కు నిర్దిష్ట నియమం అంటూ ఏం లేదు. కోలుకున్న 14 రోజుల తర్వాత వ్యాక్సిన్ మొదటి షాట్ ఇస్తున్నారు.
ప్రక్రియ ఇలా సాగుతుంది..
మొదటిగా ఎన్టీఏజీఐ సిఫార్సులు నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆఫ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ కోవిడ్ 19 బృందానికి పంపబడుతుంది. అనంతరం నిపుణుల బృందం తన సిఫార్సులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 1 నుండి 2 రోజులు పట్టవచ్చు.