కేదార్‌నాథ్ దర్శనానికి కొత్త రూల్.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా?

ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌ భవిష్యత్తులో కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలంటే ఇకపై అఫిడవిట్ సమర్పించాల్సి రావచ్చు.

By -  అంజి
Published on : 18 March 2026 8:51 AM IST

Sara Ali Khan Kedarnath Visit, Badri-Kedar Temple Committee, Non-Hindu Entry Rules, Sanatan Dharma Affidavit, Kedarnath Temple Regulations, Hemant Dwivedi

కేదార్‌నాథ్ దర్శనానికి కొత్త రూల్.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా?

ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌ భవిష్యత్తులో కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలంటే ఇకపై అఫిడవిట్ సమర్పించాల్సి రావచ్చు. ఎందుకంటే.. బద్రీ-కేదార్ ఆలయ కమిటీ మంగళవారం జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం, హిందూయేతర సందర్శకులు ఈ ఆలయాల్లో ప్రార్థనలు చేయాలంటే తాము సనాతన ధర్మాన్ని నమ్ముతున్నామని లిఖితపూర్వక ప్రకటన ఇవ్వడం తప్పనిసరి.

ఆలయ కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది మీడియాలో మాట్లాడుతూ.. "ఎవరైనా హిందూయేతరులకు సనాతన ధర్మంపై నమ్మకం ఉంటే, వారు 'నేను సనాతనిని, హిందుత్వాన్ని విశ్వసిస్తాను' అని అఫిడవిట్ సమర్పించాలి. అటువంటి వారికి మాత్రమే ఆలయంలో దర్శనానికి, ప్రార్థనలకు అనుమతి ఉంటుంది" అని స్పష్టం చేశారు. ఈ నిబంధన కేవలం సారా అలీ ఖాన్‌కే కాకుండా, ఇతర మతాలకు చెందిన భక్తులందరికీ సమానంగా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సారా అలీ ఖాన్ తన మొదటి సినిమా 'కేదార్‌నాథ్' షూటింగ్ సమయం నుండి ఈ క్షేత్రాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తున్నారు. శివునిపై తనకున్న భక్తిని చాటుకుంటూ ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఫోటోలను కూడా పంచుకుంటారు. అయితే, ఆమె గత పర్యటనల నేపథ్యంలో ద్వివేది స్పందిస్తూ.. "సారా అలీ ఖాన్‌కు సనాతన ధర్మంపై భక్తి ఉండి, ఆమె అఫిడవిట్ సమర్పిస్తే ఖచ్చితంగా ప్రార్థనలకు అనుమతిస్తాం" అని తెలిపారు. ఆలయ సంప్రదాయాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది.

Next Story