కొత్త పార్లమెంట్‌ భవన శంకుస్థాపనకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

New parliament building .. కొత్త పార్లమెంట్‌ భవన శంకుస్తాపనకు సుప్రీం కోర్టు సోమవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో

By సుభాష్  Published on  7 Dec 2020 3:36 PM IST
కొత్త పార్లమెంట్‌ భవన శంకుస్థాపనకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

కొత్త పార్లమెంట్‌ భవన శంకుస్తాపనకు సుప్రీం కోర్టు సోమవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఈనెల 10న ఈ కార్యక్రమం యాధివిధిగా జరగనుంది. సెంట్రల్‌ విస్టా ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చడం గానీ, కొత్తగా నిర్మించడం గానీ, ఇక్కడి చెట్లను తరలించడం గానీ చేయబోమన్న కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ఈ ప్రాంతంలోని ప్రాజెక్టు కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనూ కేంద్ర కొత్త నిర్మాణాలు, కూల్చివేతలు, చెట్ల తరలింపులు చేస్తుండటంపై జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ ఖచ్చితంగా ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టడం గానీ, కూల్చివేతగానీ జరగకూడదని కోర్టు స్పష్టం చేసింది.

ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ సందర్భంగా కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఇక నుంచి కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పులు జరగబోవని హామీ ఇచ్చారు. కేవలం శంకుస్థాపన మాత్రమే చేస్తామని, భౌతికంగా ఎలాంటి మార్పులు జరగబోవని ఆయన కోర్టుకు తెలిపారు. సొలిసిటర్‌ జనరల్‌ ఇచ్చిన హామీ మేరకు ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పులు చేయకుండా శంకుస్థాపన సహా ఇతర కార్యక్రమాలు చేపట్టుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

కాగా, ఈ నెల 10న కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకారంలో ఉండబోతోంది. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కనే దీన్ని నిర్మించనున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ భవనాన్ని నిర్మించబోతోంది. రూ. 861.90 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని బ్రిటీష్ హయాంలో నిర్మించారు. ఎడ్విన్ లూట్యెన్స్, హర్బర్ట్ బేకర్ ల పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. పాతబడిపోవడంతో.. కొత్త భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ కొత్త పార్లమెంట్ కు నరేంద్ర మోదీ డిసెంబర్ 10న భూమి పూజ చేయనున్నారు. భూకంపాలను సైతం తట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మించనున్నారు. ఈ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా 9 వేల మంది ఉపాధిని పొందబోతున్నారు. 1200 మంది ఎంపీలకు సరిపడేలా భవనం ఉంటుందని ఓం బిర్లా తెలిపారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రతిబింబించేలా కాన్స్టిట్యూషన్ హాల్ ఉండనుంది. ఎంపీల లాంజ్, లైబ్రరీ, పెద్ద సంఖ్యలో కమిటీ గదులు, డైనింగ్ ఏరియాలతో పాటు సువిశాల పార్కింగ్ ఉండనుంది. 2022లో మన దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకునే సమయంలో ఈ కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Next Story