Nepal: విరిగిపడ్డ కొండచరియలు..రెండు బస్సులు నదిలోపడి 65 మంది గల్లంతు
నేపాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 12 July 2024 11:16 AM ISTNepal: విరిగిపడ్డ కొండచరియలు..రెండు బస్సులు నదిలోపడి 65 మంది గల్లంతు
నేపాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. నారాయణఘాట్-మున్‌లింగ్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక అదే సమయంలో రహదారిపై 65 మందితో వెళ్తున్న రెండు బస్సులు వచ్చాయి. ఒక వైపు వర్షం పడుతుండటం.. అదే సమయంలో కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు పక్కనే ఉన్న త్రిశూన్ నదిలో పడిపోయాయి. ఈ బస్సుల్లో ఉన్నవారంతా గల్లంతయ్యారు. వీరిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. గల్లంతైనవారు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కాగా.. బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో డ్రైవర్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కాగా.. కాఠ్మాండు నుంచి 24 మంది ప్రయాణికులతో ఒక బస్సు వెళ్తుందనీ.. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు కూడా ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులని తెలిసింది. గణపతి, ఏంజెల్ ట్రావెల్స్ బస్సులుగా తెలిపారు. గణపతి డీలక్స్‌కు చెందిన బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు నదిలో పడకుండా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారని తెలిసింది. బస్సు ప్రమాదాన్ని పసిగట్టిన వారు వెంటనే బయటకు దూకారని కాఠ్మాండూ పోస్టు పేర్కొంది. అదే మార్గంలో మరో చోట కూడా కొండచరియలు విరిగిపడటంతో డ్రైవర్ తీవ్రంగా గాయాలపాలై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని మేఘ్‌నాథ్‌గా పోలీసులు గుర్తించారు. బస్సు బుట్వాల్ నుంచి కాఠ్మాండూ వెళ్తుండగా ప్రమాదం జరిగింది..
ఈ ప్రమాదం నేపాల్‌లో విషాదాన్ని నింపింది. ఒకేసారి 65 మంది నదిలో గల్లంతుకావడం కలకలం రేపుతోంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఈ సంఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. గాలింపు చర్యల్లో పాల్గొనాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నేపాల్ దేశ సాయుధ దళాలు నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నది.