ముఖ్య‌మంత్రుల‌తో మోదీ స‌మావేశం.. సెకండ్ వేవ్‌ను ఆపాల్సిందే

Need to stop 2nd wave of covid 19.అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మోదీ బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్‌లో స‌మావేశ‌మ‌య్యారు. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆపాల్సిందేన‌ని సీఎంల‌కు ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2021 9:03 AM GMT
Modi meeting CMs

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మోదీ బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్‌లో స‌మావేశ‌మ‌య్యారు. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆపాల్సిందేన‌ని సీఎంల‌కు ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. కొవిడ్ క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై చ‌ర్చిస్తున్నారు. రాష్ట్రాల అభ్య‌ర్థ‌న మేర‌కు 45 ఏళ్లు పైబ‌డిన వాళ్లంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని ఈ స‌మావేశంలో కేంద్ర‌ ఆరోగ్య శాఖ ప్ర‌తిపాదించింది. ఇక క‌రోనాకు చెక్ పెట్ట‌డానికి మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని, భౌతిక దూరం నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా రాష్ట్రాల‌కు కేంద్రం సూచించింది.

గ‌తేడాది క‌రోనా ఉద్దృతి స‌మ‌యంలోనూ ప‌లుమార్లు రాష్ట్రాల సీఎంల‌తో వీడియో కాన్స‌రెన్స్ నిర్వహించిన ప్ర‌ధాని.. టీకా ప్రారంభానికి ముందు ఈ ఏడాది జ‌న‌వ‌రిలోనూ ముఖ్య‌మంత్రుల‌తో వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర స‌హా కొన్ని రాష్ట్రాల్లో కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న నేప‌థ్యంలో నేడు మ‌రోమారు స‌మీక్ష చేప‌ట్టారు. ఇక గ‌డిచిన 24 గంటల్లో భారత్ లో ప్రమాదకర స్థాయిలో 28,903 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

డిసెంబర్ 11 తర్వాత ఒకే రోజు అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. డిసెంబర్ 11న దేశ వ్యాప్తంగా 30,254 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మన దేశంలో 1.14 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా 1,59,044 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 17,864 కేసులు, కేరళలో 1,970 కేసులు, పంజాబ్ లో 1,463 కేసులు, కర్ణాటకలో 1,135 కేసులు, గుజరాత్ లో 954 కేసులు నమోదయ్యాయి.


Next Story