ప్రభుత్వ ఏర్పాటుకి ఎన్డీఏ కసరత్తు.. రేపు కూటమి పక్షాలతో భేటి
లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 400 వరకు స్థానాలు వస్తాయని అంచనా వేసింది ఎన్డీఏ కూటమి.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 6:19 PM ISTప్రభుత్వ ఏర్పాటుకి ఎన్డీఏ కసరత్తు.. రేపు కూటమి పక్షాలతో భేటి
లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్డీఏ కూటమికి మరోసారి స్పష్టమైన మెజార్టీ దక్కబోతుంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటు కోసం కసరత్తులు మొదలుపెడుతోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్డీఏ పక్ష నేతల అంతా సమావేశం కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయా పార్టీల అధినేతలందరికీ సమాచారం అందించారు.
కాగా.. లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 400 వరకు స్థానాలు వస్తాయని అంచనా వేసింది ఎన్డీఏ కూటమి. కానీ వారు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు కీలకంగా ఉంటుంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలు కూటమిలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ 16 స్థానాల్లో, జేడీయూకి 14 ఎంపీ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కూటమిలో ఉన్న ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన పార్టీ 6, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జన శక్తి పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించాయి. ఇప్పుడు ఈ పార్టీల మద్దతు బీజేపీ అవసరం కాబోతుంది. ఇప్పటికే ప్రదాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా కూటమి సమావేశంపై చర్చించుకున్నట్లు సమాచారం.
తాజాగా వెలువడుతున్న ఫలితాలపై జేపీ నడ్డా నివాసంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో పాటు పలువురు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారు. బీజేపీ గెలుచుకున్న సీట్లు.. మిత్రపక్షాలతో రేపటి సమావేశం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.