ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ జాతీయ హోదా ఇచ్చింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. జాతీయ హోదా పెద్ద బాధ్యత అని, పార్టీ దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. దేశానికి మనం ఏదైనా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడని అర్థమవుతోందని కేజ్రీవాల్ అన్నారు. దేశ క్షేమం అవసరం లేని, దేశ ప్రగతిని వ్యతిరేకించే శక్తులన్నీ ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసంగా మారాయన్నారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతను ఇచ్చారని తెలిపారు. జాతి వ్యతిరేక శక్తులతో పోరాడుతున్నందుకు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జైలుకు వెళ్లడానికి భయపడేవారు పార్టీని వదిలిపెట్టాలన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఢిల్లీలోనే కాకుండా పంజాబ్ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది ఆప్. ఇక కేంద్ర ఎన్నికల సంఘం పలు పార్టీలకు షాకిచ్చింది. సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు జాతీయ పార్టీ హోదా రద్దు చేసింది.