టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు జాతీయ స్థాయిలో వ్యాక్సిన్ ట్రాకర్
National platform to determine impact of Corona vaccines.కరోనా టీకా తీసుకున్న అనంతరం కలిగే
By తోట వంశీ కుమార్ Published on 15 May 2021 6:48 AM GMTకరోనా టీకా తీసుకున్న అనంతరం కలిగే ప్రభావాలను, భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఇన్ ఫెక్షన్లను తెలుసుకునేందుకు త్వరలోనే ఓ ట్రాకింగ్ సిస్టం అందుబాటులోకి రానుంది. జాతీయ స్థాయిలో వ్యాక్సిన్ ట్రాకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలన్న నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్‌టీఏజీఐ) సిఫార్సుకు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి తెలిపింది. కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధని పెంచిన నేపథ్యంలో ట్రాకింగ్ వ్యవస్థ అవసరం ఎంతైన ఉందని నిపుణులు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో వ్యాక్సిన్ ప్రభావాలను సమీక్షించేందుకు ఐసీఎంఆర్‌తో పాటు ఇతర సంస్థలకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని.. ఎన్‌టీఏజీఐ సిఫార్సు చేసిందని వ్యాక్సిన్ వర్కింగ్ గ్రూప్‌లోని సభ్యులు డాక్టర్ ఎన్‌కే అరోడా తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్న 6 నెలల తర్వాత టీకా తీసుకోవాలని, ప్రసవం తర్వాత ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని, గర్భిణులు కూడా వారి ఇష్టం ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవచ్చునని ఎన్‌టీఏజీఐ సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
ఎన్‌టీఏజీఐ చేసిన సిఫార్సులు ఇవే..
- వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చిన తర్వాత కరోనా సోకితే.. వారికి కోలుకున్న 4-8 వారాల తర్వాత రెండవ డోస్ ఇవ్వాలి. ప్రస్తుతం, ఈ రోగులకు కోలుకున్న 14 రోజుల తర్వాత రెండవ డోస్ ఇస్తున్నారు.
- కరోనా రోగులకు కోలుకున్న ఆరు నెలల తర్వాత టీకాలు వేయాలి. ప్రస్తుతం, కోలుకున్న రోగులకు 14 రోజుల తర్వాత మొదటి డోస్ ఇస్తున్నారు. ఆరు నెలల తర్వాత టీకాలు ఇచ్చినట్లయితే.. శరీరంలో ఉత్పత్తి అయ్యే సహజమైన యాంటీబాడీల కార్యాచరణను పెంచే అవకాశం ఉంది.
- గర్భిణీలు టీకా తీసుకునేందుకు ఇప్పటివరకు అనుమతి లేదు. తాజాగా.. వారికీ టీకా అందించవచ్చని ఎన్‌టీఏజీఐ సూచించింది. అంతే కాకుండా.. రెండు టీకాల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటును కూడా ఇచ్చింది. అయితే టీకాల వల్ల కలిగే నష్టాలు, లాభాలను వారికి స్పష్టంగా చెప్పాలని పేర్కొంది. ఇక డెలివరీ తర్వాత బాలింతలు ఎప్పుడైనా టీకాలు తీసుకోవచ్చునని తెలిపింది.