National Girl Child Day: మీ పిల్లలకు గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ గురించి చెబుతున్నారా?
అభం శుభం తెలియని చిన్నారులపై కామాంధుల కళ్లు పడుతున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.
By అంజి Published on 24 Jan 2024 5:21 AM GMTNational Girl Child Day: గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ గురించి చెబుతున్నారా?
అభం శుభం తెలియని చిన్నారులపై కామాంధుల కళ్లు పడుతున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే చాలా సందర్భాల్లో తెలిసిన వారి నుంచే చిన్నారులు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. కాబట్టి చిన్నారులకు వీటి గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం. వాస్తవానికి శరీరానికి కూడా సొంతంగా కొన్ని నియమాలు ఉంటాయని చిన్న పిల్లలకు తెలియజేయడం ఎంతో ముఖ్యం. ఒక వేళ వాటిని ఇతరులు అతిక్రమిస్తున్నప్పుడు కేవలం స్పందించడమే కాదు.. వెంటనే ఎలా వ్యతిరేకించాలో కూడా నేర్పించాలి. ఇది నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
ఎలా చెప్పాలి..
మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందే ఓసారి అనుకోని సిద్ధం అవ్వండి. మీ పిల్లలు ఆడుకునే బొమ్మల్ని ఇందుకు సాధనంగా ఉపయోగించుకోండి. ఆ బొమ్మ సాయంతో ఏ ప్రదేశాలను తాకొచ్చు, ఏ ప్రదేశాలను తాకకూడదో చెప్పండి. తాకకూడని ప్రదేశాలను ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి మంచి వాడు కాదని, తనకు హానీ చేసే అవకాశం ఉందని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పండి. అలాంటప్పుడు అక్కడ ఒక సెకను కూడా ఉండకుండా పరుగెత్తుకుంటూ వచ్చేయాలని హెచ్చరించండి.
షాపుకు తీసుకెళ్తూ, మా ఇంట్లో ఆడుకో రా, మా ఫ్రిజ్‌లో చాక్లెట్లుఉన్నాయి ఇస్తా రా.. ఇలాంటి మాటలను నమ్మవద్దని చెప్పండి. ఇలా చిరుతిళ్లు ఆశపెట్టే ఎక్కువ మంది కామాంధులు పిల్లలను అపహరించడం, వారిని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అఘాయిత్యాలకు పాల్పడం వంటి ఘోరాలు చేస్తున్నారు. కాబట్టి వీటి గురించి ముందే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
సాధారణంగా పిల్లలకు ఏ విషయం అయినా వారి చదువు లేదా జ్ఞానం ద్వారా తెలిసిపోతాయి. కానీ గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ మధ్య తేడాపై వారికి తల్లిదండ్రులు లేదా టీచర్లు అవగాహన కల్పించడం తప్పనిసరని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బాడీలో ప్రైవేటు భాగాల గురించి వారికి చెప్పాలి. పిల్లలు వారిపై జరుగుతున్న ఆకృత్యాల గురించి తెలుసుకోలేరు కాబట్టి, ఎవరూ కూడా తమ ప్రైవేటు భాగాలను తాకనీయవద్దని, మరొకరి పార్ట్‌లను వీరు తాకవద్దని చెప్పాలి. అది ఆడుకునే స్నేహితుడైనా, పాఠాలు చెప్పే మాస్టారు అయినా, అన్న, తమ్ముడు, ఇలా.. ఎవరైనా తప్పుగా వెంటనే తనకి చెప్పాలని పిల్లలకు తల్లి అవగాహన కల్పించాలి.
చిన్నతనం నుంచే పిల్లలకు కళ్లు, చెవులు, ముక్కు గురించి ఎలా చెబుతామో.. అలాగే వ్యక్తిగత శరీర భాగాల గురించి అవగాహన వచ్చేలా చూడాలి. ఎవరైనా తమ ఛాతీ, వ్యక్తిగత శరీర భాగాలు తడుముతుంటే వెంటనే గట్టిగా అరవమని, లేదంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పాలి. అంతే కాదు అలా ఎవరైనా తాకితే భయపడకుండా మీకు చెప్పమనాలి. తెలియని వారి ఇళ్లకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించండి.