ప్రముఖ ఆన్‌లైన్ దుస్తుల విక్రయ సంస్థ మింత్రా తన లోగోను మార్చేసింది. ఆ సంస్థ లోగో మహిళలను కించపరిచేలా ఉందంటూ ముంబైలో కేసు నమోదైంది. అవెస్తా ఫౌండేషన్‌కు చెందిన నాజ్ పటేల్.. మింత్రా లోగోపై గతేడాది డిసెంబర్‌లో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోగోలోని(ఎం అక్షరం) మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందని.. దానిని మార్చేలా చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు.
పటేల్ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మింత్రా లోగో మహిళలను కించపరిచేలా ఉందని నిర్ధారించారు. దీంతో సంస్థకు, దాని అధికారులకు పోలీసులు నోటీసులు పంపారు. స్పందించిన సంస్థ లోగోను మార్చేస్తామని వారు తమకు హామి ఇచ్చారని ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ రష్మీ కరండికార్ చెప్పారు. అనంతరం పోలీసులకు ఇచ్చిన హామీ మేరకు లోగోను మింత్రా సరికొత్తగా డిజైన్ చేసింది.కొత్తలోగోను మింత్రా వెబ్‌సైట్, యాప్‌లోనూ మార్చింది. ప్యాకింగ్‌పైనా కొత్తలోగో రానుంది. లోగో మార్పును కొందరు నెటీజన్లు స్వాగతించగా.. మరికొందరు మాత్రం లోగోను మార్పులు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.