మిజోరాం ఎయిర్‌పోర్టులో ఆర్మీ విమానం బోల్తా.. 8 మందికి గాయాలు
మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మయన్మార్ ఆర్మీ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది.
By అంజి Published on 23 Jan 2024 12:41 PM ISTమిజోరాం ఎయిర్‌పోర్టులో కూలిన ఆర్మీ విమానం బోల్తా
మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మయన్మార్ ఆర్మీ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్‌కు చేరుకోకముందే మయన్మార్ మిలటరీ విమానం అదుపు తప్పింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన ఈరోజు ఉదయం 10.19 గంటల ప్రాంతంలో జరిగింది. మూలాల ప్రకారం.. మయన్మార్ సైన్యం, పౌర సైన్యం మధ్య ఘర్షణల కారణంగా కొన్నాళ్ల క్రితం లాంగ్ట్లై జిల్లా నుండి పారిపోయిన మయన్మార్ సైనికులను భారత్‌లోకి చొరబడ్డారు. ఈ క్రమంలోనే వారిని వెనక్కి తీసుకెళ్లేందుకు మయన్మార్ నుంచి సైనిక విమానం వచ్చింది. తాజాగా జరిగిన ప్రమాదం సమయంలో విమానంలో 13 మంది ఉన్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. భారత్ సోమవారం కనీసం 184 మంది మయన్మార్ సైనికులను స్వదేశానికి పంపింది. గత వారం మొత్తం 276 మంది మయన్మార్ సైనికులు మిజోరంలోకి ప్రవేశించారని, సోమవారం నాడు వారిలో 184 మందిని మయన్మార్‌కు తిప్పి పంపినట్లు అస్సాం రైఫిల్స్ అధికారిక ప్రకటనలో ధృవీకరించింది. సైనికులు జనవరి 17న మిజోరాంలోని లాంగ్ట్లాయ్ జిల్లాలో ఇండియా-మయన్మార్-బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ వద్ద ఉన్న బందుక్‌బంగా గ్రామంలోకి ప్రవేశించి, సహాయం కోసం అస్సాం రైఫిల్స్‌కు లొంగిపోయారు.
అప్పటి నుండి అస్సాం రైఫిల్స్ వారి బాగోగులు చూసుకుంటోంది. వీరిని శనివారం ఆయిజోల్‌కు తరలించారు. అక్కడి లెంగ్‌పుయ్ ఎయిర్ పోర్టు నుంచి మయన్మార్‌కు పంపించారు. ఈ గ్రూపులో కర్నల్, 36 మంది ఆఫీసర్లు, 240 మంది జవాన్లు ఉన్నారు. 2021 నుంచి మయన్మార్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని సైన్యం కూలదోయడంతో అంతర్యుద్ధానికి బీజం పడింది.