ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. స్కూటర్ యజమానికి ఏకంగా రూ. 20,74,000 చలాన్ రావడంతో స్థానిక పోలీసులు సమస్యలో చిక్కుకున్నారు. నవంబర్ 4న నాయి మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ కాలనీ పోలీస్ పోస్ట్‌లో ఈ సంఘటన జరిగింది. స్కూటర్ రైడర్ అన్మోల్ సింఘాల్‌కు జారీ చేసిన చలాన్‌లో, అతను హెల్మెట్ ధరించలేదని, డ్రైవింగ్ లైసెన్స్ లేదని, సరైన వాహన పత్రాలను చూపించలేడని పేర్కొన్నారు. చలాన్ జారీ చేసిన తర్వాత, పోలీసులు స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
యజమాని చలాన్ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగానే, ఆ పోస్ట్ వైరల్ అయింది. అసాధారణంగా కనిపించే జరిమానా చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. చిన్న, చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలా విధించగలరని వినియోగదారులు ప్రశ్నించేలా చేసింది. వైరల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించిన తర్వాత, ముజఫర్ నగర్ పోలీసు శాఖ సీనియర్ అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని స్పష్టం చేశారు. డిజిటల్ చలాన్ నింపేటప్పుడు క్లరికల్ పొరపాటు వల్లే ఈ జరిమానా విధించిందని నిర్ధారించారు.