కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం.. మే 15 వ‌ర‌కు అవ‌న్నీ క్లోజ్

Museums closed till may 15.కేంద్రం పర్యవేక్షణలో ఉండే పురాతన, చారిత్రక కట్టడాలు, మ్యూజియాలతో పాటు భారత పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే అన్ని కట్టడాలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2021 7:21 AM IST
Taj Mahal

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మరోమారు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం పర్యవేక్షణలో ఉండే పురాతన, చారిత్రక కట్టడాలు, మ్యూజియాలతో పాటు భారత పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే అన్ని కట్టడాలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకోగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది.

గత ఏడాది సైతం ఇదే తరహాలో దేశంలోని చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను అన్ని రకాల కట్టడాలను మూసివేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేశారు. అయితే, తాజాగా, గతంలో కంటే ఎక్కువగా కరోనా కొత్త కేసులు నమోదవుతుండటంతో మరోసారి ఆంక్షలు అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది.

బుధవారం ఒక్కరోజే 2 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కట్టడి కోసం కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. కొత్త ఆంక్షలను కూడా అమల్లోకి తీసుకొస్తున్నాయి.


Next Story