షాకింగ్.. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో 'పశువుల దాణా'..
Municipal School In Pune Receives Cattle Feed As Mid-Day Meal For Students.పేదరికం కారణంగా ఎవరూ విద్యకు
By తోట వంశీ కుమార్ Published on 20 March 2021 6:11 AM GMTపేదరికం కారణంగా ఎవరూ విద్యకు దూరం కావొద్దన్న ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని తీసుకొచ్చారు. అయితే.. ఈ పథకం అమల్లో కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేద సరికాదా తాజాగా మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద అధికారులు ఏకంగా పశువుల దాణాను సప్లై చేయడం గమనార్హం. దేశంలోని అత్యంత ధనవంతమైన మున్సిపల్ కార్పొరేషన్లలో పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి అనే విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 15 వరకు రూ.3,285 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇంతటి ఆర్థిక వనరులు ఉన్న నగరంలోని మున్సిపల్ స్కూల్ నెం 58లో తాజా ఘటన జరగడం గమనించాల్సిన విషయం.
వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇంటికి చేరాలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీంతో పూణె కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న 58వ నెంబర్ మున్సిపల్ స్కూల్‌కు ఇటీవల మధ్యాహ్న భోజన పథకం మెటీరియల్ వచ్చింది. అయితే.. స్కూల్‌కు వచ్చిన ఆ మెటీరియల్ ను చూసి పాఠశాల అధికారులు షాక్ తిన్నారు. పశువుల దాణాను విద్యార్థుల మధ్యాహ్న భోజన కింద పంపినట్లు గుర్తించారు. విషయం సామాజిక కార్యకర్తలకు తెలియడంతో దీనిపై అధికారులను నిలదీశారు.
మిడ్ డే మీల్స్ పేరుతో పంపించిన ఆ పశువుల దానా బ్యాగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) అధికారులు ఆ ఫుడ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై స్పందించిన పూణె మేయర్ మురళీధర్ మొహోల్.. వచ్చిన ఆహార పదార్థాల్ని పంచడం మాత్రమే తమ విధి అని తెలిపారు. అయితే, దాణా రావడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆమె.. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్ఫష్టం చేశారు.