ముంబైలో డెల్టా ప్లస్‌తో తొలి మరణం
Mumbai Records First Death From Delta Plus Covid Variant.కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2021 6:54 AM GMT
కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. రోజువారీ కేసులు 40వేలకు పైనే నమోదవుతున్నాయి. ఐతే మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్ విజృంభిస్తుండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. వేగంగా విస్తరిస్తూ ప్రాణాలు బలిగొంటోంది. ముంబైలో డెల్టా ప్లస్ తొలి మరణం నమోదైంది. డెల్టాప్లస్ వేరియంట్ సోకి 63 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. దీంతో మహారాష్ట్రలో డెల్టాప్లస్ బలితీసుకున్న వారి సంఖ్య రెండుకు పెరిగింది. జూన్‌లో రత్నగిరిలో 80 ఏళ్ల వృద్దుడు కూడా డెల్టాప్లస్ వేరియంట్‌తోనే చనిపోయాడు.
ముంబై ఈస్టర్న్ సబర్బ్‌కి చెందిన 63 ఏళ్ల వృద్దురాలు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు రావడంతో పరీక్షలు చేయించుకుంది. జూలై 21వ తేదీన ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఆ పేషెంట్‌కు డయాబెటిస్‌తో పాటు పలు రకాల రుగ్మతలు ఉన్నాయని అధికారులు చెప్పారు. రెండు డోసుల టీకాలు తీసుకున్న తర్వాత ఆ మహిళకు వైరస్ సోకినట్లు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో జూలై 24న ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో జూలై 27న ఆమె మరణించింది. చనిపోయిన అనంతరం ఆమెకు డెల్టా ఫ్లస్ వేరియంట్‌గా గుర్తించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు పరీక్షలు జరపగా.. ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియంట్ ఎటాక్ అయినట్టు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.