తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సింగర్ లతా మంగేష్కర్. మనదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఆమె పాటలకు అభిమానులు ఉన్నారు. కాగా.. కొద్ది రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ నెల 11 నుంచి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షల్లో ఆమెకు న్యుమోనియా ఉందని తేలడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోని.. తిరిగి రావాలని పలువురు ప్రముఖులు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ ఆటోడ్రైవర్ లతా మంగేష్కర్‌పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ముంబైలో సత్యవాన్ గీతే అనే డ్రైవర్ నివసిస్తున్నాడు. అతడు లతా మంగేష్కర్‌కి పెద్ద అభిమాని. ఆమెను సరస్వతి దేవి రూపంగా బావిస్తాడు. తన ఆటోలో కూడా ఆమె ఫోటోలు ఉంటాయి. ఆమె పాటలు తప్ప మరే పాటలు తన ఆటోలో ఉండవు. కాగా.. లతా మంగేష్కర్ అనారోగ్యం బారిన పడ్డారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న సత్యవాన్ గీతే.. ఆమె త్వరగా కోలుకోవాలని నిత్యం ప్రార్థనలు చేస్తున్నాడు. లతా జీ చికిత్స కోసం తన సంపాదన మొత్తం దానం చేశాడు.
మెరుగవుతున్న లతా మంగేష్కర్ ఆరోగ్యం
లతా మంగేష్కర్ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ ప్రతిత్ సామ్‌దాని చెప్పారు. ఆమె ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని, తాము ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యంపై బులిటెన్‌లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.