ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపు.. 4 రోజుల్లో మూడోసారి

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి మరోసారి హత్య బెదిరింపు వచ్చింది. రూ. 400 కోట్లు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరింపు ఇమెయిల్ వచ్చింది

By అంజి  Published on  31 Oct 2023 9:26 AM IST
Mukesh Ambani , death threat, Reliance Industries

ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపు.. 4 రోజుల్లో మూడోసారి 

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీకి మరోసారి హత్య బెదిరింపు వచ్చింది. రూ. 400 కోట్లు ఇవ్వకపోతే హత్య చేస్తామని సోమవారం నాడు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది, గత 4 రోజుల్లో పంపిన బెదిరింపుల్లో ఇది మూడవ హత్యా బెదిరింపు. అతని భద్రత ఎంత కట్టుదిట్టమైనా 'ఒక్క స్నిపర్' సరిపోతుందని అంబానీకి మెయిల్ వచ్చింది. పంపిన వారి మాట వినకపోవడంతో ఇప్పుడు రూ.400 కోట్లు చెల్లించాలని మెయిల్‌లో పేర్కొన్నట్లు ఇండియా టుడే రిపోర్ట్‌ చేసింది.

ప్రస్తుతం ముంబై పోలీసులు ముఖేష్ అంబానీకి వచ్చిన బెదిరింపు మెయిల్ ఫేక్ ఈమెయిల్ అడ్రస్ ద్వారా పంపారా లేక నిజమైనదేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇమెయిల్ చిరునామాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు మెయిల్ ప్రొవైడర్ కంపెనీని సంప్రదించడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అంబానీకి అక్టోబర్ 27 నుంచి ఒకే ఈమెయిల్ ఐడీ నుంచి బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. అన్ని బెదిరింపు ఇమెయిల్‌లు డబ్బులు డిమాండ్‌ చేశాయని అధికారులు తెలిపారు.

శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ. 20 కోట్లు ఇవ్వకపోతే ముకేశ్‌ అంబానీని చంపుతామంటూ ఓ మెయిల్ వచ్చింది. మళ్లీ అదే ఈమెయిల్‌ నుంచి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. గతంలో మేము పంపిన మెయిల్‌కు స్పందించలేదు కాబట్టి, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచుతున్నామని అగంతకులు మెయిల్ చేశారు. రూ.200 కోట్లు చెల్లించకుంటే అంబానీని కాల్చి చంపేస్తానని ఒకరోజు తర్వాత మరో ఇమెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

మూడు ఇమెయిల్‌లు ఒకే ఇమెయిల్ ఐడి నుండి పంపబడ్డాయని, పంపిన వ్యక్తి షాదాబ్ ఖాన్‌గా గుర్తించామని అధికారులు తెలిపారు. జర్మనీలోని బెల్జియం నుంచి మెయిల్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. పారిశ్రామికవేత్త సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు మేరకు గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 387 (ఒక వ్యక్తిని మరణ భయం లేదా దోపిడీకి పాల్పడే క్రమంలో తీవ్రంగా గాయపరచడం), 506 (2) (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడిని పట్టుకోవడానికి వేట కొనసాగుతోంది.

గత ఏడాది.. ముకేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు బిహార్‌లోని దర్భంగాకు చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిని పేల్చివేస్తామని నిందితులు బెదిరించారు.

Next Story